పవన్‌పై బీజేపీ కత్తులు రెడీ చేస్తోందా?
చాలా రాష్ట్రాల్లో తనను కాదని వెళ్ళిపోయిన పార్టీలను బీజేపీ దుంపనాశనం చేస్తోంది. ఏపీలో కూడా అదే పద్దతిని అనుసరించాలని బీజేపీ అనుకుంటున్నట్లుంది.
మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై బీజేపీ మండిపోతోంది. పవన్‌పై కత్తులు దూయటం ఒకటే మిగిలింది. రణస్ధలం బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీతో పొత్తుంటుందని చెప్పేశారు. తమతో మిత్రపక్షంగా ఉంటూనే చంద్రబాబును పవన్ కలుస్తుండటాన్ని కమలనాథులు అడ్డుకోలేకపోయారు. ఎందుకంటే పొత్తుపై పవన్ కూడా ప్రకటించలేదు కాబట్టి. ఎప్పుడు మాట్లాడినా బీజేపీ కూడా టీడీపీతో పొత్తు పెట్టుకునేట్లుగా ఒప్పిస్తానని మాత్రమే చెప్పేవారు.
అలాంటిది బహిరంగ సభలో ఏకపక్షంగా టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్న విషయాన్ని ప్రకటించేశారు. దాంతో బీజేపీ నేతలకు షాక్ కొట్టినట్లయ్యింది. చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకోవటం అన్నది ఇంతకాలం ముసుగులో గుద్దులాట లాగే ఉండేది. అలాంటిది తమతో ముందు మాట మాత్రం కూడా చెప్పకుండానే బహిరంగ సభలో పవన్ చేసిన ప్రకటన కమలనాథులకు షాకిచ్చింది. ఈ నేపధ్యంలోనే తాజాగా బీజేపీ చీఫ్ సోమువీర్రాజు చేసిన ప్రకటన కలకలం రేపుతోంది.
వీర్రాజు మాట్లాడుతూ పవన్ వ్యాఖ్యలపై ఇంకొంత స్పష్టత వస్తే అందరి కత్తులకు పదునెక్కుతుందని అన్నారు. కత్తులకు పదునెక్కుతుందని అనటంలో అర్ధమేంటి? విచిత్రం కాకపోతే పవన్ ప్రకటనపై వీర్రాజుకు ఇంకా స్పష్టత రావాలట. టీడీపీతో పొత్తు పెట్టుకుంటానని పవన్ ప్రకటించిన తర్వాత కూడా ఇంకా స్పష్టత రావాలని వీర్రాజు చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. వీర్రాజు చెప్పింది ఎలాగుందంటే టీడీపీతో పొత్తు పెట్టుకోవటం కాదు బీజేపీతో పొత్తును తెంచుకుంటున్నట్లు ప్రకటన చేయాలి అన్నట్లుగా ఉంది.
పవన్ మాటలు కొత్తగా ఉన్నాయని ఇంకాస్త స్పష్టత కోరుకుంటున్నట్లు వీర్రాజు చెప్పారు. అంటే పవన్‌కు వ్యతిరేకంగా బీజేపీ కత్తులు దూయటానికి రెడీ అవుతున్నట్లే అనుకోవాలి. చాలా రాష్ట్రాల్లో తనను కాదని వెళ్ళిపోయిన పార్టీలను బీజేపీ దుంపనాశనం చేస్తోంది. ఏపీలో కూడా అదే పద్దతిని అనుసరించాలని బీజేపీ అనుకుంటున్నట్లుంది. అప్పుడు కష్టాలు పవన్‌కు మాత్రమే కాదు జనసేనతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబుకు కూడా సమస్య తప్పేట్లులేదు. చివరకు ఏమవుతుందో చూడాలి.