రాజ్యసభలో రంగా ప్రస్తావన.. ఎందుకంటే..?
కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు రంగా పేరు పెట్టాలని తాను కేంద్రాన్ని కోరుతున్నానని జీవీఎల్ వెల్లడించారు.
ఉన్నట్టుండి వంగవీటి రంగాను ఏపీ బీజేపీ నేతలు మోసేయడం మొదలు పెట్టారు. ఆయన పేరుని ఏపీలోని ఓ జిల్లాకు పెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఏ జిల్లాకు పెట్టాలో కూడా వారే డిసైడ్ చేశారు. కృష్ణా జిల్లా లేదా మచిలీపట్నం జిల్లాల్లో ఒకదానికి వంగవీటి రంగా పేరు పెట్టాలని కోరారు. ఇదేదో ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట కాదు, రాజ్యసభలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు వినిపించిన కోరిక.
సడన్ గా ఎందుకు..?
మిగతా చోట్ల మత రాజకీయాలు చేస్తూ నెట్టుకొస్తున్న బీజేపీకి ఏపీలో మతాల వారీగా ప్రజల్ని విడగొట్టి లబ్ధిపొందే అవకాశం లేదు. ఇక్కడ ఓటర్లు ఆల్రడీ కులాల వారీగా విడిపోయారు. ఇందులో కాపు వర్గాన్ని ఆకర్షించడానికి బీజేపీ ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది. అందుకే జనసేనతో చెలిమి చేస్తోంది. కానీ ఇటీవల పవన్ కల్యాణ్ టీడీపీకి దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉన్నారు. దీంతో ఏపీ బీజేపీ సొంతగా కాపు అజెండాను ఎత్తుకుంది. గతంలో వినిపించిన డిమాండ్ ను, మళ్లీ కొత్తగా రాజ్యసభ వేదికగా వినిపించారు జీవీఎల్.
రాజ్యసభలో జీరో అవర్ లో మాట్లాడిన ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. వంగవీటి గొప్పదనం గురించి సభలో వివరించారు. పేదలు, బడుగు, బలహీన వర్గాలు ఆయన్ను ఆరాధ్య దైవంగా కొలుస్తారని చెప్పారు. అత్యంత పెద్ద సామాజికవర్గమైన కాపులకు చెందిన రంగా.. కేవలం ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా పని చేసినా, గొప్ప ప్రజా నాయకుడిగా గుర్తింపు పొందారని తెలిపారు. అలాంటి రంగాను 1986 డిసెంబర్ నెలలో కొంతమంది హతమార్చారని, మరణం తర్వాత కూడా రంగా ప్రజల గుండెల్లో ఉన్నారని చెప్పారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఇతర నాయకుల పేర్లను జిల్లాలకు పెట్టారు కానీ, కానీ రంగా పేరును మాత్రం పెట్టలేదన్నారు. కృష్ణా, మచిలీపట్నం జిల్లాల్లో ఒక జిల్లాకు రంగా పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టుకు రంగా పేరు పెట్టాలని తాను కేంద్రాన్ని కోరుతున్నానని జీవీఎల్ వెల్లడించారు.