బిజెపి పొత్తు మిస్టరీ.. పవన్ కల్యాణ్‌తో విభేదించిన చంద్రబాబు
బిజెపితో పొత్తుపై స్పష్టత రావడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల పోరాటంలో వెనుకబడిపోతున్నామనే భావనతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొదటి జాబితాను విడుదల చేయడానికి ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది.
టీడీపీ, జనసేన కూటమితో బిజెపి కలిసి వస్తుందా, లేదా అనేది ఇంకా మిస్టరీగానే ఉంది. టీడీపీ, జనసేన అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించేనాటికి కూడా బిజెపి పొత్తుపై స్పష్టత రాలేదు. బిజెపి కలిసి వస్తుందనే ఆశ టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి ఉన్నట్లు లేదు. అందుకే, బిజెపితో పొత్తు అంశంపై పవన్ కల్యాణ్ మాటలతో ఆయన విభేదించారు.
రాష్ట్రంలోని 99 అసెంబ్లీ స్థానాలకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి అభ్యర్థులను ప్రకటించారు. ఈ సందర్భంగా బిజెపితో పొత్తు అంశం ప్రస్తావనకు వచ్చింది. తమ పొత్తుకు బిజెపీ శుభాశీస్సులున్నాయని పవన్ కల్యాణ్ చెప్పారు. అయితే, బిజెపితో పొత్తు అంశంపై చంద్రబాబు అంత ఆశాజనకంగా మాట్లాడలేదు. ప్రస్తుతానికి టీడీపీ, జనసేన పొత్తు ఖరారైందని, పవన్ కల్యాణ్ చెప్పినట్లు బిజెపి కలిసి వస్తే అప్పుడు వారితో పొత్తు గురించి ఆలోచిస్తామని, ఇప్పటికైతే జనసేన, టీడీపీ పొత్తుకు సంబంధించిన అభ్యర్థులను ఖరారు చేస్తున్నామని ఆయన చెప్పారు.
బిజెపితో పొత్తుపై స్పష్టత రావడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికల పోరాటంలో వెనుకబడిపోతున్నామనే భావనతో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మొదటి జాబితాను విడుదల చేయడానికి ముందుకు వచ్చినట్లు కనిపిస్తోంది. బిజెపితో మాట్లాడడానికి పవన్ కల్యాణ్ హస్తినకు వెళ్తారని భావించారు. కానీ ఆయనకు బిజెపి పెద్దల అపాయింట్‌మెంట్ దొరకలేదు.
అటు చంద్రబాబుకు గానీ ఇటు పవన్ కల్యాణ్‌కు గానీ ఏ విషయం చెప్పకుండా, వారికి కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకుండా బిజెపి పెద్దలు ఆడుకుంటున్నారు. బిజెపి ఎప్పుడు స్పష్టత ఇస్తుందో కూడా తెలియని పరిస్థితి. బిజెపి మాట కోసం ఎదురుచూస్తూ మీనమేషాలు లెక్కిస్తూ పోతే వైఎస్ జగన్‌ను ఎదుర్కోవడం మరింత కష్టంగా మారుతుందని చంద్రబాబు అనుకున్నారు. దీంతో తెగించి అభ్యర్థుల జాబితా విడుదలకు నడుం బిగించారు.
బిజెపి పొత్తు పెట్టుకోవడానికి ముందుకు వస్తే ఆ పార్టీకి కేటాయించే సీట్లను వదిలేసి మిగతా సీట్లకు అభ్యర్థులను ఖరారు చేసినట్లుగా భావిస్తున్నారు. అయితే, బిజెపి టీడీపితో పొత్తు పెట్టుకుంటుందా అనేది అనుమానంగానే ఉంది.