టీడీపీకి షాక్.. మాజీ మంత్రి గొల్లపల్లి గుడ్ బై.!
తాజాగా రాజోలు టికెట్ ఆశించి భంగపడిన మాజీమంత్రి, సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారని సమాచారం.
ఉమ్మడి అభ్యర్థుల ప్రకటన తర్వాత తెలుగుదేశం, జనసేన పార్టీల్లో అసమ్మతి భగ్గుమంది. తాజాగా రాజోలు టికెట్ ఆశించి భంగపడిన మాజీమంత్రి, సీనియర్ నేత గొల్లపల్లి సూర్యారావు తెలుగుదేశం పార్టీకి షాక్ ఇవ్వబోతున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన తెలుగుదేశం ఫ్లెక్సీలు, జెండాలను కూడా ఆయన అనుచరులు తొలగించారు.
గొల్లపల్లి త్వరలోనే వైసీపీ కండువా కప్పుకుంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది. అయితే వైసీపీలోనూ రాజోలు టికెట్ ఆయనకు దక్కే అవకాశాలు లేవు. 2014లో రాజోలు నుంచి గెలిచిన గొల్లపల్లి.. 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థి రాపాక వరప్రసాద్ చేతిలో ఓడిపోయారు. తర్వాత రాపాక వరప్రసాద్ వైసీపీకి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం రాపాక వైసీపీలోనే ఉన్నారు.
గొల్లపల్లి సూర్యారావు వైసీపీలో చేరితే ఆయనకు అమలాపురం లోక్‌సభ టికెట్ కేటాయిస్తారని తెలుస్తోంది. ఈ ఆఫర్‌తోనే ఆయన వైసీపీ కండువా కప్పుకునేందుకు అంగీకరించారని సమాచారం. గొల్లపల్లి 2004లో తొలిసారి అల్లవరం నుంచి గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. వైఎస్ కేబినెట్‌లో చిన్న పరిశ్రమల శాఖ మంత్రిగా పని చేశారు. 2014లో రాష్ట్ర విభజన అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరి 2014లో రాజోలు నుంచి గెలిచి 2019లో ఓడిపోయారు.