మైలవరంలో వసంతకు షాక్..కొత్త ఇన్‌ఛార్జిగా సర్నాల తిరుపతిరావు
దెందులూరులో శనివారం జరగనున్న సిద్ధం రెండో సభకు తాను హాజరుకానని, క్యాడర్‌ను కూడా తీసుకురాలేనని ప్రకటించారు వసంతకృష్ణ ప్రసాద్.
రాబోయే అసెంబ్లీ ఎన్నికలను వైసీపీ అధిష్టానం చాలా సీరియస్‌గా తీసుకుంది. వరుసగా రెండో సారి అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే సామాజిక, ఆర్థిక సమీకరణాల ఆధారంగా నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల మార్పులు, చేర్పులు చేపట్టింది. కొంతమందికి స్థానచలనం కలిపించగా, మరికొంతమందిని పక్కన పెట్టేసింది. సర్వేల్లో ప్రతికూలంగా ఫలితాలు వస్తే ఎంతటివారినైనా పక్కనపెట్టేస్తున్నారు ఆ పార్టీ అధినేత జగన్.
తాజాగా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌కు షాక్ ఇచ్చింది వైసీపీ హైకమాండ్. మైలవరం ఇన్‌ఛార్జిగా సర్నాల తిరుపతి రావును నియమిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం తిరుపతి రావు మైలవరం జడ్పీటీసీగా ఉన్నారు. తిరుపతి రావు యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. వచ్చే ఎన్నికల్లో మైలవరం నుంచి తిరుపతి రావును ఎమ్మెల్యేగా బరిలో నిలపనున్నట్లు సమాచారం. వచ్చే జాబితాలో తిరుపతి రావు పేరు ఉండే అవకాశాలు ఉన్నాయి.
కొద్ది రోజులుగా వసంత కృష్ణ ప్రసాద్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇక దెందులూరులో శనివారం జరగనున్న సిద్ధం రెండో సభకు తాను హాజరుకానని, క్యాడర్‌ను కూడా తీసుకురాలేనని ప్రకటించారు వసంతకృష్ణ ప్రసాద్. దీంతో వసంత తీరుపై సీఎం జగన్ సైతం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మైలవరం నుంచి సిద్ధం సభకు కేడర్‌ను తరలించే బాధ్యతను ఎంపీ కేశినేని నాని తీసుకున్నారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వసంత కృష్ణ ప్రసాద్.. 2019 ఎన్నికల్లో మాజీ మంత్రి దేవినేని ఉమాపై గెలుపొందారు.