Telugu Global
Andhra Pradesh

ఏపీలో రూ.50కే కిలో ట‌మాటా.. ప్ర‌జ‌ల‌కు భారీ ఊర‌ట‌.. - రైతుబ‌జార్ల‌లో విక్ర‌యాల‌కు ప్ర‌భుత్వం ఆదేశం

టమాటా ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో కిలో రూ.50కే విక్రయించాల‌ని నిర్ణయం తీసుకుంది.

ఏపీలో రూ.50కే కిలో ట‌మాటా.. ప్ర‌జ‌ల‌కు భారీ ఊర‌ట‌.. - రైతుబ‌జార్ల‌లో విక్ర‌యాల‌కు ప్ర‌భుత్వం ఆదేశం
X

గ‌త ఐదు రోజులుగా ట‌మాటా ధ‌ర‌లు ఆకాశాన్నంటుతున్న విష‌యం తెలిసిందే. దీంతో సామాన్య ప్ర‌జ‌లు అల్లాడిపోతున్నారు. టమాటా ధ‌ర కేజీ రూ.100 దాటిపోగా, అన్న‌మ‌య్య జిల్లా మ‌ద‌న‌ప‌ల్లి మార్కెట్‌లో గురువారం అది మ‌రింత పెరిగి రూ.124కు చేరింది. గ‌తంలో ఎన్న‌డూ లేనంత రికార్డు ధ‌ర ప‌ల‌క‌డం గ‌మ‌నార్హం. మార్కెట్‌కు సాధార‌ణంగా 1500 ట‌న్నులు వ‌చ్చే ట‌మాటా గురువారం మాత్రం 750 ట‌న్నులు మాత్రమే వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో వ్యాపారుల మ‌ధ్య పోటీ పెరిగి ధ‌ర ఆకాశాన్నంటింది.

మ‌రోప‌క్క టమాటా ధరల పెరుగుదలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రాష్ట్ర ప్రజలకు ఏపీ ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో రైతు బజార్లలో కిలో రూ.50కే విక్రయించాల‌ని నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రజలకు నిత్యావసర కూరగాయల అంశంలో ఊరట లభించింది. కడప, కర్నూలులోని రైతు బజార్లలో గురువారం నాడు మార్కెటింగ్ శాఖ టమాట విక్రయాలను ప్రారంభించింది. సబ్సిడీ ధరపై టమాటా విక్రయాలు శుక్రవారం నుంచి మరిన్ని జిల్లాల్లో ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.

రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ క్రమంగా టమాటా విక్రయాలు ప్రారంభం కానున్నాయని రైతు బజార్ల సీఈఓ నంద కిషోర్ తెలిపారు. డిమాండ్‌, సప్లయ్‌ల మధ్య వ్య‌త్యాస‌మే ధరలు పెరగడానికి కారణమని ఈ సంద‌ర్భంగా ఆయన వివరించారు. కూరగాయలు ఎక్కువగా పండే ప్రాంతాల్లో వర్షాలు ప‌డ‌టం వ‌ల్ల‌ పంటల ఉత్పత్తిపై ప్రభావం చూపింద‌ని, కూరగాయల సరఫరా తగ్గడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు.

ప్రస్తుతం మదనపల్లె మార్కెట్లో టమాటా పెద్ద ఎత్తున లభిస్తున్నాయని సీఈవో వెల్ల‌డించారు. రాష్ట్ర ప్రభుత్వమే కాదు, ఇతర రాష్ట్రాల వ్యాపారులు కూడా మదనపల్లి మార్కెట్‌పైనే ఆధారపడి సరఫరా చేస్తున్నారని తెలిపారు. మార్కెట్‌కు సరఫరా, రాకపోకల ఆధారంగా, తాము రైతు బజార్‌లలో విక్రయించడానికి ట‌మాటాను సేకరిస్తున్నామ‌న్నారు. బుధ, గురువారాల్లో పరిమిత స్టాక్ ఉందని, అది మెరుగుపడుతుందని తాము భావిస్తున్నామని తెలిపారు. మరో రెండు రోజుల్లో విశాఖపట్నంతో పాటు ఇతర జిల్లాల్లోని రైతు బజార్లకు టమాటా సరఫరా చేసేందుకు ప్లాన్ చేస్తున్నామ‌ని చెప్పారు.

First Published:  30 Jun 2023 2:18 PM IST
Next Story