చంద్రబాబు తిప్పలు చెప్పనలవి కాదు
కోస్తాంధ్రలో ఊపుమీదున్న జనసేన, సహజంగానే ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుంది. ఆయా స్థానాల్లో తెలుగుదేశం ఆశావహులు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
పవన్ కల్యాణ్‌తో బేరాలు కుదిరాయి. బీజేపీతో లోపాయకారీ మంతనాలు జరిగాయి. షర్మిలను రంగంలోకి దించడంలో చంద్రబాబు ఎత్తుగడ పారింది. అనగా బాబు కాపు ఓటునీ చీల్చాడు. బీజేపీ సహకారమూ పొందుతున్నాడు. జగన్ ఓట్లపై దెబ్బకొట్టడానికి షర్మిలను రాజకీయపావుగా వాడుతున్నాడు. రంజుగా ఉందిగా ఆంధ్ర రాజకీయం..!
అయితే ఈ ఎత్తుగడలన్నీ సీట్లుగా మారి చంద్రబాబుని కాటువేస్తున్నాయి. పవన్ కల్యాణ్ 68 మంది జనసేన ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లతో జాబితాను బాబు గారికి ఇచ్చాడంటున్నారు. అంటే జనసేన 68 సీట్లు ఇమ్మని అడుగుతున్నట్లేగా..! బాబు కొన్నిచోట్లయినా బీజేపీకి అండగా నిలబడాలి. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గనక, ఆ పార్టీకీ కొన్ని స్థానాల్లో గెలిచే వీలు కల్పించాలి. అనగా దాదాపు 30 నుంచి 40 సీట్లు మిత్రపక్షాలకు కేటాయించి తీరాలి.
ఇది అంత తేలికైన పనికాదు. తెలుగుదేశం పెద్ద పార్టీ అయినందువల్లా, గతంలో ఐదుళ్లు ఆంధ్రప్రదేశ్‌ను పరిపాలించినందువల్లా, రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో దానికి చిన్నా, పెద్దా నాయకులు ఉన్నారు. 30–40 సీట్లు గనక ఇతరులకి ఇస్తే, ‘దేశం’లో తిరుగుబాట్లు తప్పవు. విజయవాడలో కేశినేని నాని అంతటి ముఖ్యనాయకుడే, చంద్రబాబుపై విమర్శల దాడిచేసి, జగన్ పార్టీలో జాయిన్ అయిపోయాడు.
కోస్తాంధ్రలో ఊపుమీదున్న జనసేన, సహజంగానే ఎక్కువ సీట్లు డిమాండ్ చేస్తుంది. ఆయా స్థానాల్లో తెలుగుదేశం ఆశావహులు తిరుగుబాటు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబుకిది మమూలు తలనొప్పి కాదు. బుర్రవాచిపోవడం ఖాయం. మిత్రుల్ని సంతోషపరిచే గేమ్‌లో భాగంగా, 130లోపు స్థానాలకు టీడీపీ పోటీ చేయాల్సి రావచ్చు. తిరుగుబాట్ల తుఫాన్‌లో చిక్కుకుపోనున్న తెలుగుదేశం పార్టీకి వెన్నుపోట్లు తప్పవు. ఈ చిక్కుముడిని సజావుగా విప్పడం చంద్రబాబు వల్ల కూడా అయ్యేపని కాదు. చూస్తూనే ఉండండి.. తెలుగుదేశంలో అల్లకల్లోలం.. త్వరలో విడుదల..!