Telugu Global
Andhra Pradesh

అనంతపురం నేలల్లో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉపయోగించే అరుదైన ఖనిజాలు

ఇక్కడ ఎంత మొత్తంలో ఈ మూలకాలు ఉన్నాయో స్పష్టంగా తెలుసుకునేందుకు రాబోయే రోజుల్లో మరింత లోతుగా డ్రిల్లింగ్ చేసి పరీక్షలు జరుపుతామని ఎన్జీఆర్ఐ సైంటిస్టులు అన్నారు.

అనంతపురం నేలల్లో ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉపయోగించే అరుదైన ఖనిజాలు
X

ఏపీలోని అనంతపురం నేలల్లో అరుదైన ఖనిజాలను నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా పని చేసే ఎన్జీఆర్ఐ గత కొన్నేళ్లుగా అనంతపురం నేలల్లో ఖనిజాల కోసం అన్వేషణ సాగిస్తోంది. ఈ క్రమంలో 15 అరుదైన భూమి మూలకాలు (రేర్ ఎర్త్ ఎలిమెంట్స్) గుర్తించినట్లు తెలిపారు. వీటిని సెల్‌ఫోన్స్, టీవీలు, కంప్యూటర్లు, ఆటోమొబైల్స్‌లో ఉపయోగించే క్లిష్టమైన కాంపోనెంట్స్ తయారీలో ఉపయోగిస్తారు.

ఎన్జీఆర్ఐ అనంతపురం ప్రాంతంలో సాంప్రదాయేతర రాళ్ల కోసం అన్వేషణ చేస్తుండగా లాంథనైడ్ సిరీస్‌కు చెందిన అరుదైన ఖనిజాలు బయటపడ్డాయి. ఇవి అల్లనైట్, సెరియేట్, థోరైట్, కొలంబైట్, టాంటలైట్, అపాటైట్, జిర్కాన్, మోనాజైట్, పైరోక్లోర్ యూక్సనైట్ మరియు ఫ్లోరైట్‌గా గుర్తించారు. అనంతపురం జిల్లాలోని రెడ్డిపల్లె, పెద్దవాడగురు గ్రామాల్లో జిర్కాన్‌కు చెందిన అనేక రకాల శిలలను గుర్తించామని ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ పీవీ సుందర్ రాజు తెలిపారు. మోనోజైట్ రేణువులు వివిధ రంగుల్లో కనిపించాయని, ఇక్కడ తప్పకుండా రేడియోయాక్టీవ్ మూలకాలు ఉండే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

కాగా, ఇక్కడ ఎంత మొత్తంలో ఈ మూలకాలు ఉన్నాయో స్పష్టంగా తెలుసుకునేందుకు రాబోయే రోజుల్లో మరింత లోతుగా డ్రిల్లింగ్ చేసి పరీక్షలు జరుపుతామని అన్నారు. ఈ ఎలిమెంట్స్ క్లీన్ ఎనర్జీ, ఏరో స్పేస్, డిఫెన్స్, మ్యాగ్నెట్స్, ఆధునిక ఎలక్ట్రానిక్స్, విండ్ టర్బైన్స్, జెట్ ఎయిర్‌క్ట్రాఫ్ట్స్ పరిశ్రమలకు ఉపయోగకరంగా ఉంటాయని చెబుతున్నారు. ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్‌ను అత్యున్నత సాంకేతిక పరిశోధనల్లో ఉపయోగిస్తారని.. ఇవి ప్రకాశవంతంగా ఉండటమే కాకుండా మంచి ఉత్ప్రేరక లక్షణాలు కలిగి ఉంటాయని ఆయన అన్నారు.

అనంతరపురం, చిత్తూరు జిల్లాల్లోని దంచెర్ల, పెద్దవాడుగురు, దండువారిపల్లె, రెడ్డిపల్లె, చింతలచెరువు, పులికొండ కాంప్లెక్స్ ప్రాంతాల్లో ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎన్జీఆర్ఐ సైంటిస్టులు చెబుతున్నారు. దంచెర్ల ప్రాంతంలో దాదాపు 18 చదరపు కిలోమీటర్ల ప్రాంతంలో వీటి లభ్యత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ జియోకెమికల్ అధ్యయనం కూడా ప్రస్తుతం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.

First Published:  4 April 2023 6:56 AM IST
Next Story