విమర్శల డోసు పెంచిన భువనేశ్వరి..
ఓదార్పు యాత్రలో భాగంగా బాధిత కుటుంబాలను కలసిన భువనేశ్వరి వారికి రూ.3లక్షల చెక్కును అందించారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
"నిజం గెలవాలి" అంటూ ప్రజల్లోకి వచ్చిన నారా భువనేశ్వరి, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల డోసు పెంచారు. తన భర్తను అన్యాయంగా జైలులో పెట్టారని అంటూనే రాష్ట్రంలో అరాచక పాలన ఉందని మండిపడ్డారు. చంద్రబాబు పరిపాలనలో రాష్ట్ర ఎంతో సంతోషంగా ఉండేదని, జగన్ పాలనలో గంజాయి, అరాచకాలు, రౌడీయిజం తప్ప ఇంకేమీ కనిపించడంలేదని అన్నారామె. మహిళలకు రక్షణ లేకుండా పోయిందని.. వైసీపీ రాష్ట్రాన్నే కాకుండా న్యాయాన్ని నిర్భంధించిందని చెప్పారు. నిజం గెలవాలంటే మనం అందరం చేయి చేయి కలిపి పోరాడాలని పిలుపునిచ్చారు.
ఓదార్పు యాత్రలో భాగంగా బాధిత కుటుంబాలను కలసిన భువనేశ్వరి వారికి రూ.3లక్షల చెక్కును అందించారు. భవిష్యత్తులో కూడా ఆ కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. తొలిసారిగా తాను రాజకీయ సభలకు వస్తున్నానని, భావితరాల కోసం, చంద్రబాబుని బయటకు తీసుకుని రావడం కోసం మనం పోరాటం చేయాలన్నారు భువనేశ్వరి.
ఎన్టీఆర్ స్పూర్తితోనే చంద్రబాబు పాలన చేశారని, ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటు చేశారని చెప్పారు భువనేశ్వరి. 3వేల మందికి పైగా పేద విద్యార్థులను తాను చదివిస్తున్నానన్నారు. చంద్రబాబుకి ప్రజలే కుటుంబం అని, వారి తర్వాతే తాము అని చెప్పారు. ఐటీ రంగాన్ని తీసుకుని వచ్చి లక్షలాది మంది జీవితాల్లో ఆయన సంతోషాన్ని నింపారన్నారు. అలాంటి చంద్రబాబుని అరెస్ట్ చేసి జైలులో పెట్టారని, హత్యాయత్నం కేసు కూడా పెట్టారని ఆరోపించారు. సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడం దారుణం అన్నారు. లోకేష్ పాదయాత్రను అడ్డుకుని మైక్ లాక్కున్నారని, ఇంత దారుణమైన పాలనను తానెప్పుడూ చూడలేదన్నారు భువనేశ్వరి.
అది మీకు సాధ్యం కాదు..
చంద్రబాబును నిర్భంధిస్తే, మెంటల్ గా డిస్ట్రబ్ అవుతారని వైసీపీ భావిస్తోందని, అందుకే ఎన్నికలకు ముందు కావాలని జైలుకు పంపారని అన్నారు భువనేశ్వరి. చంద్రబాబు చాలా బలమైన వ్యక్తి అని.. ఆయనకు ఏమీ కాదని, జైలు నుంచి బయటకు వస్తారని, తిరిగి అధికారం చేపడతారని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రబాబుని బలహీనపరచి, టీడీపీని అంతం చేయాలనుకోవడం అసాధ్యం అన్నారు భువనేశ్వరి.
♦