Telugu Global
Andhra Pradesh

చంద్రబాబుకి విశ్రాంతి.. జనంలోకి భువనేశ్వరి

టీడీపీ మాత్రం ఆయన బయటకొచ్చినా కూడా కొన్నాళ్లు రెస్ట్ ఇవ్వాలని అనుకుంటోంది. అందుకే చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో ఆల్రడీ ప్రచార కార్యక్రమాలను రూపొందించింది.

చంద్రబాబుకి విశ్రాంతి.. జనంలోకి భువనేశ్వరి
X

శుక్రవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై అనుకూలంగా తీర్పు వచ్చినా.. లేక రిమాండ్ సమయం పూర్తయిన తర్వాత ఇక కొనసాగింపు లేకపోయినా చంద్రబాబు జైలునుంచి బయటకొస్తారు. అయితే టీడీపీ మాత్రం ఆయన బయటకొచ్చినా కూడా కొన్నాళ్లు రెస్ట్ ఇవ్వాలని అనుకుంటోంది. అందుకే చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో ఆల్రడీ ప్రచార కార్యక్రమాలను రూపొందించింది. నిజం గెలవాలి అనే పేరుతో భువనేశ్వరి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించేందుకు టీడీపీ పథక రచన చేసింది.

నిజం గెలవాలంటూ భువనేశ్వరి ప్రజల్లోకి రాబోతున్నారు. చంద్రబాబు అరెస్ట్ కారణంగా చనిపోయారని చెబుతున్నవారి కుటుంబాలను ఆమె పరామర్శిస్తారు. అయికే ప్రతిరోజూ ఆమె పరామర్శలకు వెళ్లే అవకాశం లేదు. వారానికి కనీసం మూడు రోజులు ఆమె పర్యటన ఉండేట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ పర్యటనల్లోనే ఆమె బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం చేస్తారని అంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సభల్లో ఆమె ప్రసంగిస్తారు.

భవిష్యత్ కు లోకేష్ గ్యారెంటీ..

చంద్రబాబు అరెస్టుతో ఆగిపోయిన భవిష్యత్‌ కు గ్యారెంటీ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. భవిష్యత్‌ కు గ్యారెంటీ కార్యక్రమంలో చంద్రబాబు స్థానంలో లోకేష్ యాత్రలు చేపడతారు. ఒకవేళ చంద్రబాబు జైలునుంచి విడుదలై ఆయన యాత్రకు సుముఖంగా ఉంటే.. భవిష్యత్ గ్యారెంటీని తండ్రికి వదిలేసి, కొడుకు యువగళం తిరిగి మొదలు పెడతారు. ఇలా పార్టీ నిర్ణయాలు తీసుకుంది. దీనిపై తుది ప్రకటన వెలువడాల్సి ఉంది.

బాబు డల్ అయినట్టేనా..?

40రోజులకు పైగా జైలులో ఉన్న చంద్రబాబు.. బయటకొచ్చినా ఇప్పుడప్పుడే మునుపటి ఉత్సాహంతో ప్రజల్లోకి వస్తారని అనుకోలేం. పైగా ఆయనకు చర్మ సంబంధిత సమస్యలున్నాయని అంటున్నారు. మానసికంగా, శారీరకంగా ఆయన పూర్తిగా కోలుకోడానికి సమయం పడుతుంది. అసలు జైలునుంచి విడుదలే కాకపోతే బాబు ప్రస్తావనే లేదు. అందుకే ముందు జాగ్రత్తగా లోకేష్, భువనేశ్వరి జనంలోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతానికి బ్రాహ్మణిని రంగంలోకి దించడంలేదు.

First Published:  18 Oct 2023 9:56 PM IST
Next Story