అడ్డంగా దొరికిపోయిన భువనేశ్వరి
అక్టోబర్ రెండో వారంలో ప్రవీణ్ రెడ్డి, సెప్టెంబర్ 25వ తేదీన చిన్నబ్బ చనిపోతే సెప్టెంబర్ 4వ తేదీన వాళ్ళ పేర్లతో చెక్కులు ఎలా రెడీ అయ్యాయో భువనేశ్వరే సమాధానం చెప్పాలి.
నిజం గెలవాలి అనే స్లోగన్‌తో బస్సు యాత్ర మొదలుపెట్టిన భువనేశ్వరి అడ్డంగా దొరికిపోయారా? నిజం గెలవాలనే నినాదంతో మొదలుపెట్టిన యాత్రలో పంపిణీ చేస్తున్న చెక్కులపైన అనుమానాలు పెరిగిపోతున్నాయా? అంటే అవుననే అంటోంది జగన్మోహన్ రెడ్డి మీడియా. స్కిల్ స్కామ్ చంద్రబాబునాయుడు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారనే ఆరోపణలతో భువనేశ్వరి నిజం గెలవాలి అనే స్లోగన్‌తో బుధవారం యాత్ర మొదలుపెట్టారు. యాత్ర ఉద్దేశం ఏమిటంటే చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించటమే.
యాత్ర చేయటంలో తప్పులేదు, పరామర్శించి ఆర్థికంగా ఆదుకోవటంలో కూడా తప్పులేదు. కానీ ఆ పేరుతో రాజకీయం చేయటమే తప్పు. ఇప్పుడు భువనేశ్వరి చేస్తున్నది ఇదే. ఎలాగంటే బుధవారం నాడు ప్రవీణ్ రెడ్డి, కనుమూరి చిన్నబ్బనాయుడు కుటుంబాలను భువనేశ్వరి పరామర్శించి రెండు కుటుంబాలకు తలా రూ. 3 లక్షల చెక్కు అందజేశారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే అసలు ట్విస్టు ఇక్కడే ఉంది.
అదేమిటంటే చెక్కులపైన ఉన్న తేదీలు సెప్టెంబర్ 4వ తేదీవి. చంద్రబాబు అరెస్టయ్యింది సెప్టెంబర్ 9వ తేదీన. భువనేశ్వరి యాత్ర మొదలుపెట్టి చెక్కులు పంపిణీ చేసింది అక్టోబర్ 25వ తేదీన. సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబు అరెస్టయితే ఎవరు చనిపోయినా సెప్టెంబర్ 9 తర్వాత అయ్యుండాలి. చనిపోయిన వారి కుటుంబాలకు ఆర్థికసాయం చేసిన చెక్కులపైన కూడా తాజా డేట్లే ఉండాలి. అయితే చెక్కులపైన సెప్టెంబర్ 4వ తేదీ ఎలాగుంది? అంటే తన అరెస్టుకు ముందే ఏదో అవసరాల కోసం చంద్రబాబు చెక్కులు రెడీ చేసుండాలి.
మరో విషయం ఏమిటంటే భువనేశ్వరి పంపిణీ చేసిన చెక్కులపైన చంద్రబాబు సంతకాలున్నాయి. గడచిన 48 రోజలుగా జైలులోనే ఉన్న చంద్రబాబు.. పంపిణీ చేసిన చెక్కులపై సంతకాలు ఎలా చేయగలిగారు? అంటే ఏదో అవసరాల కోసం సెప్టెంబర్ 4వ తేదీకి ముందే చంద్రబాబు చెక్కులపైన సంతకాలు చేసుండాలి. అప్పటి చెక్కులనే ఇప్పుడు భువనేశ్వరి పంపిణీ చేస్తున్నారు. అక్టోబర్ రెండో వారంలో ప్రవీణ్ రెడ్డి, సెప్టెంబర్ 25వ తేదీన చిన్నబ్బ చనిపోతే సెప్టెంబర్ 4వ తేదీన వాళ్ళ పేర్లతో చెక్కులు ఎలా రెడీ అయ్యాయో భువనేశ్వరే సమాధానం చెప్పాలి. భువనేశ్వరి ఉద్దేశంలో నిజం గెలవటం అంటే ఇదేనా?