Telugu Global
Andhra Pradesh

భువనేశ్వరి ‘ఓదార్పు’ యాత్ర?

చంద్రబాబు అరెస్టు కారణంగా చనిపోయినవాళ్ళ కుటుంబాలను తాను తొందరలోనే వ్యక్తిగతంగా కలుసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించారు.

భువనేశ్వరి ‘ఓదార్పు’ యాత్ర?
X

ఇప్పటివరకు ఓదార్పుయాత్ర అనగానే అందరికీ జగన్మోహన్ రెడ్డే గుర్తుకొస్తారు. అప్పట్లో హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించిన విషయం తెలిసిందే. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన అభిమానుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ ఓదార్పుయాత్ర చేశారు. ఈ యాత్రే కాంగ్రెస్ పార్టీకి జగన్ కుటుంబానికి మధ్య చిచ్చుపెట్టింది. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలు అందరికీ తెలిసిందే. మళ్ళీ అలాంటి యాత్రే అంటే ఓదార్పుయాత్ర పేరు మళ్ళీ ప్రముఖంగా వినిపిస్తోంది.

కాకపోతే ఇప్పుడు వినిపించేది భువనేశ్వరి వైపు నుండి.. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబునాయుడు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. తమ అభిమాన నేత జైలుకు వెళ్ళటాన్ని జీర్ణించుకోలేని 105 మంది అభిమానులు చనిపోయారట. అందుకని వాళ్ళ కుటుంబాలను పరామర్శించి మనో ధైర్యాన్ని నింపటానికి భువనేశ్వరి తొందరలోనే ఓదార్పుయాత్ర చేయబోతున్నట్లు సమాచారం. చంద్రబాబు అరెస్టు కారణంగా చనిపోయినవాళ్ళ కుటుంబాలను తాను తొందరలోనే వ్యక్తిగతంగా కలుసుకోబోతున్నట్లు ఆమె ప్రకటించారు.

మృతుల కుటుంబాలను కలిసి మనోధైర్యం కల్పించబోతున్నారంటే అది కచ్చితంగా ఓదార్పు యాత్రే అవుతుందని తమ్ముళ్ళు ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టేశారు. భువనేశ్వరి చేయబోయే యాత్రకు ఇంకా అధికారికంగా పేరును ప్రకటించలేదు. అయితే ఇప్పటికే పార్టీ నేతల్లో భువనేశ్వరి ఆధ్వర్యంలో ఓదార్పు యాత్ర ప్రారంభమవుతోందనే ప్రచారమైతే జరిగిపోతోంది. చనిపోయిన వాళ్ళ కుటుంబ సభ్యులను వ్యక్తిగతంగా భువనేశ్వరి కలిసేందుకు అవసరమైన ఏర్పాట్లు రూటు మ్యాప్‌ సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. భువనేశ్వరి ఓదార్పుయాత్రలో రెండు పాయింట్లున్నాయి. మొదటిదేమో బాధిత కుటుంబాలను కలిసి ఓదార్చి ఆర్థికంగా ఎంతో కొంత సాయాన్ని ప్రకటించటం.

ఇక రెండో పాయింట్ ఏమిటంటే యాత్రకు వెళ్ళిన ప్రతి ప్రాంతంలోనూ చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో జనాల మద్దతును కూడగట్టడం. చంద్రబాబుపై అన్యాయంగా కేసులు మోపి, అక్రమంగా అరెస్టు చేసి జైలులో పెట్టి హింసిస్తున్నారని భువనేశ్వరి ప్రచారం చేయబోతున్నారు. తన ప్రచారం వల్ల చంద్రబాబుకు బాగా సింపతి వస్తుందని బహుశా ఆమె అనుకుంటున్నట్లున్నారు. సో, రెండు అంశాలు కలిసొస్తాయి కాబట్టి తొందరలోనే జనాల్లోకి వెళ్ళటానికి ఓదార్పు యాత్రను వేదికగా మార్చుకోవాలని ఇప్పటికే భువనేశ్వరి డిసైడ్ అయ్యారు. ఈ రోజు కోర్టులో విచారణ తర్వాత ముహూర్తం ఫిక్స్ చేసుకుంటారు.


First Published:  3 Oct 2023 4:59 AM GMT
Next Story