భువనేశ్వరి అదే తప్పు చేస్తున్నారా?
చంద్రబాబు అంత గొప్పోడు, తమకు అంత పౌరుషముంది, చంద్రబాబు ఎంతటి నిజాయితీపరుడనే విషయాలనే పదేపదే చెబుతున్నారు. ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా కుటుంబ సోది తప్ప జనాలకు ఉపయోగపడేది మాత్రం ఏమీ ఉండటంలేదు.
ఒకప్పుడు చంద్రబాబునాయుడు చేసిన తప్పునే ఇపుడు భువనేశ్వరి కూడా చేస్తున్నారు. నిజం గెలవాలి అనే నినాదంతో భువనేశ్వరి బస్సుయాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్రలో జనాలను ఉద్దేశించి సొంత సోది చెప్పుకుంటున్నారు. చంద్రబాబు అంత గొప్పోడు, తమకు అంత పౌరుషముంది, చంద్రబాబు ఎంతటి నిజాయితీపరుడనే విషయాలనే పదేపదే చెబుతున్నారు. ఎక్కడ మాట్లాడినా, ఎవరితో మాట్లాడినా కుటుంబ సోది తప్ప జనాలకు ఉపయోగపడేది మాత్రం ఏమీ ఉండటంలేదు.
పైగా చంద్రబాబును అరెస్టు చేసిన కారణంగా కష్టాల్లో ఉన్న తమ కుటుంబానికి జనాలందరు మద్దతుగా నిలవాలని, తమ పోరాటంలో చేయి కలపాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నారు. అసలే ఆమె తెలుగు అంతంతమాత్రం. దానికి తోడు ఆమె ఏమి చెప్పదలచుకున్నారన్న విషయంలో క్లారిటి లేదు. దాంతో భువనేశ్వరి స్పీచంటేనే జనాలకు విసుగొచ్చేస్తోంది. ఆమె ఎక్కడ పర్యటించినా టీడీపీ జనాలే తప్ప మామూలు జనాలు చాలా తక్కువగా ఉన్నారు. చంద్రబాబు జైలులో ఉన్న సంగతి తన మనవడు దేవాన్ష్ కు ఇప్పటివరకు చెప్పలేదన్నారు. విదేశాలకు వెళ్ళారని అబద్ధాలు చెప్పి నెట్టుకొస్తున్నట్లు భువనేశ్వరి చెప్పటమే విచిత్రంగా ఉంది.
చంద్రబాబు అరెస్టయిన విషయంలోనే మనవడికి అబద్ధం చెప్పిన భువనేశ్వరి నిజం గెలవాలని యాత్ర చేయటమే ఆశ్చర్యంగా ఉంది. పైగా తాము కష్టాల్లో ఉన్నాం కాబట్టి తమకు అందరు మద్దతుగా నిలవాలని అడుతున్నారు. జనాలకు కష్టమొస్తే తానున్నాని ధైర్యం చెప్పే వాళ్ళనే జనాలు నేతగా గుర్తుపెట్టుకుంటారు కానీ జనాలను తమ కుటుంబానికి అండగా నిలవమని అడగితే పట్టించుకోరన్న విషయాన్ని భువనేశ్వరి మరచిపోయారు. ఒకప్పుడు చంద్రబాబు కూడా మీడియా సమావేశంలో కన్నీళ్ళు కనబడకుండా భోరున ఏడ్చారు.
తనను అరెస్టు చేస్తారని చెప్పిన చంద్రబాబు.. తనకు జనాలు అండగా నిలబడాలని బతిమలాడుకున్న విషయం గుర్తుండే ఉంటుంది. పార్టీ నేతలకో లేకపోతే జనాలకో కష్టమొస్తే చంద్రబాబు అండగా ఉంటారని అనుకుంటారు. అలాంటిది తనకు కష్టమొస్తే అండగా నిలబడాలని జనాలను బతిమలాడుకున్నపుడే చంద్రబాబు జనాల్లో చీపైపోయారు. ధైర్యంగా నిలబడేవాళ్ళని, సవాళ్ళను ఎదుర్కొనే వాళ్ళకే జనాలు పట్టంకడతారు కానీ బేలగామాట్లాడే వాళ్ళకి మద్దతుగా నిలబడరని భువనేశ్వరి ఎప్పుడు గ్రహిస్తారో.