టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి
ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు. రాబోయే బ్రహ్మోత్సవాలు కూడా ఆయన హయాంలోనే జరిగే అవకాశాలున్నాయి.
తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. గతంలో కూడా ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. 2006-2008 సమయంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు. ఇప్పుడు జగన్ హయాంలో మరోసారి ఆయనకు ఆ అవకాశం లభించింది.
వైవీకి కీలక బాధ్యతలు..
ఇప్పటి వరకూ టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఇకపై పూర్తిగా పార్టీ వ్యవహారాల్లో నిమగ్నం అవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఇకపై ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు కూడా చూస్తారని అంటున్నారు.
చాలా పేర్లు వినిపించినా..
వాస్తవానికి రెండేళ్ల క్రితమే టీటీడీకి కొత్త చైర్మన్ ని నియమించాల్సి ఉంది. కానీ వైవీ సుబ్బారెడ్డికి రెండోసారి పదవిని కొనసాగించింది ప్రభుత్వం. ఈసారి కూడా చాలా పేర్లు పరిశీలనకు వచ్చాయి. నెల్లూరు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆ పోస్ట్ కాపులకు ఇవ్వాలనే డిమాండ్ కూడా వినిపించింది. కానీ సీఎం జగన్ మాత్రం కరుణాకర్ రెడ్డివైపే మొగ్గుచూపారు. ప్రస్తుతం తిరుపతి ఎమ్మెల్యేగా ఉన్న కరుణాకర్ రెడ్డి, టీటీడీ చైర్మన్ గా త్వరలో బాధ్యతలు స్వీకరిస్తారు. రాబోయే బ్రహ్మోత్సవాలు కూడా ఆయన హయాంలోనే జరిగే అవకాశాలున్నాయి.