Telugu Global
Andhra Pradesh

బలిజలు, యాదవుల మధ్య చిచ్చు పెడుతున్నారు జాగ్రత్త –పవన్

తిరుపతిలో మాత్రం ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాలు మొదలయ్యాయని, వాటిని నిలువరించాలని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్. అధికార పార్టీ నేతల ఉచ్చులో ఎవరూ పడకుండా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు.

బలిజలు, యాదవుల మధ్య చిచ్చు పెడుతున్నారు జాగ్రత్త –పవన్
X

బలిజలు, యాదవుల మధ్య కొట్లాటలు పెట్టడానికి వైసీపీ ప్రయత్నిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేశారు పవన్ కల్యాణ్. తిరుపతిలో ఈ ప్రయత్నాలు జరిగాయని అన్నారు. బలిజలు, యాదవుల మధ్య ఉన్న సఖ్యత చెడగొట్టే విధంగా అధికార పార్టీ వ్యక్తులు రెచ్చగొట్టే చర్యలు చేపడుతున్నారని, వారి ఉచ్చులో పడొద్దని హితవు పలికారు. ఈమేరకు పవన్ కల్యాణ్ ఓ ప్రకటన విడుదల చేశారు. కులాల మధ్య చిచ్చుపెట్టే కుతంత్రాలను నిలువరించాలని కోరారు. కులాల మధ్య అంతరాలు తగ్గించి సఖ్యత పెంచేందుకు జనసేన కృషి చేస్తోందన్నారు పవన్.


ఇటీవల మచిలీపట్నంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో కూడా పవన్ కల్యాణ్ కులాలకు సంబంధించిన వ్యాఖ్యలే చేశారు. ఏపీలో కులాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. తనని తిట్టించేందుకు కాపులను, బీసీలను ఎగదోస్తున్నారని అన్నారు. కాపులు, బీసీల మధ్య ఎందుకు చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. ఆ తర్వాత కూడా పవన్ పై కాపు నేతలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పవన్ కుల రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

తిరుపతిలో మాత్రం ఇప్పటికే ఇలాంటి ప్రయత్నాలు మొదలయ్యాయని, వాటిని నిలువరించాలని పిలుపునిచ్చారు పవన్ కల్యాణ్. అధికార పార్టీ నేతల ఉచ్చులో ఎవరూ పడకుండా జాగ్రత్తగా ఉండాలని హితవు పలికారు. కుతంత్రాలకు పాల్పడుతున్న వారిని ఆదిలోనే నిలువరించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కులాల మధ్య చిచ్చులు రేపి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారుని చెప్పారు. కులాల్లోనూ వర్గాలు ఏర్పాటు చేసి ఐకమత్యాన్ని దెబ్బ తీసి తాము ఆధిపత్యం చలాయించాలని చూస్తున్నారన్నారు. ఈ రోజు తిరుపతి కావచ్చు, రేపు మరొక ప్రాంతం కావచ్చు.. అని ఇలాంటి సమయంలో అన్ని కులాలవారు, ముఖ్యంగా యువతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటివారికి ప్రజాస్వామ్య పంథాలోనే సమాధానం ఇవ్వాలని సూచించారు.

First Published:  17 March 2023 2:56 PM IST
Next Story