Telugu Global
Andhra Pradesh

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలో బెట్టింగులు

తెలంగాణలో ప్రముఖులు బరిలో నిలిచిన నియోజకవర్గాలపై ఎక్కువ బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్, కామారెడ్డి.. రేవంత్ బరిలోకి దిగిన కొడంగల్‌పై ఎక్కువ బెట్టింగులు నడుస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై ఏపీలో బెట్టింగులు
X

తెలంగాణలో ఏ పార్టీ గెలుస్తుంది..? బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా..? కాంగ్రెస్‌కు ఓ ఛాన్స్ వస్తుందా..? బీజేపీ జెండా ఎగురుతుందా..?. సీఎం ఎవరవుతారు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి..? హంగ్ ఏమైనా వచ్చే ఛాన్సుందా..?. తెలంగాణలో ఏ నలుగురు కలిసినా ఇదే చర్చ. తెలంగాణలోనే కాదు పక్క రాష్ట్రం ఏపీలో కూడా ఇదే విషయంపై చర్చించుకుంటున్నారు. చర్చ వరకే ఆగకుండా ఓ అడుగు ముందుకేసి బెట్టింగులు కూడా పెడుతున్నారు.

ఏపీలోని పశ్చిమగోదావరి, విజయవాడ, గుంటూరు, నెల్లూరు ప్రాంతాలకు చెందిన క్రికెట్‌, కోడి పందాల నిర్వాహకులు తెలంగాణ ఎన్నికలపై దృష్టిపెట్టారు. ఐపీఎల్‌, వ‌ర‌ల్డ్ క‌ప్‌లో పందెం కాసి నష్టపోయిన వారిని ఏజెంట్లుగా మార్చుకొని దందా ప్రారంభించారు. వాట్సప్‌ గ్రూపుల్లోనే బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారని సమాచారం. ఫలితంగా వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి.

తెలంగాణలో ప్రముఖులు బరిలో నిలిచిన నియోజకవర్గాలపై ఎక్కువ బెట్టింగులు జరుగుతున్నాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్ పోటీచేస్తున్న గజ్వేల్, కామారెడ్డి.. రేవంత్ బరిలోకి దిగిన కొడంగల్‌పై ఎక్కువ బెట్టింగులు నడుస్తున్నాయి. వీటితో పాటు GHMC పరిధిలోని ఎల్బీనగర్‌, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, ఉప్పల్‌, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్‌, జూబ్లీహిల్స్‌ స్థానాలపై బెట్టింగ్ జరుగుతోంది. అలాగే కరీంనగర్‌, సూర్యాపేట, హుజూరాబాద్‌, దుబ్బాక, నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపైనా బెట్టింగులు కాస్తున్నారు.

అగ్రనాయకులు పోటీ చేస్తున్న స్థానాలపై బెట్టింగ్ 1:10 గా నడుస్తుండగా.. మిగతా నియోజకవర్గాల్లో 1:5 గా జరుగుతోంది. ముందు వందకు 5వేలు, 6వేలని ఆశపెడుతున్న బెట్టింగ్ ముఠా తర్వాత కమీషన్‌ పేరుతో సగం లూటీ చేస్తోందని కూడా ప్రచారం జరుగుతోంది. బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తమ దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీసులు. డబ్బు ఆశకు పోయి కటకటాల పాలవ్వొద్దని సూచిస్తున్నారు.

First Published:  16 Nov 2023 11:00 AM IST
Next Story