సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం.. - ఏపీకి చెందిన ముఠా అరెస్ట్
ఉద్యోగంలో చేరేందుకు కావాల్సిన పత్రాల కోసం రూ.30 వేలు ఇవ్వాలని నిందితులు చెప్పగా, ప్రదీప్ గూగుల్ పే యాప్ ఆ సమయంలో పనిచేయలేదు.
ఐటీ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసగిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నలుగురు నిందితుల ముఠాను బెంగళూరు పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో విజయవాడకు చెందిన మల్లు శివశంకర్‌రెడ్డి అలియాస్ గోపీచంద్ (26), గుంజ మంగారావు (35), షేక్ శహబాషి (30), గుంటూరుకు చెందిన మహేశ్ (21) ఉన్నారు. ఈ వివరాలు డీసీపీ డాక్టర్ అనూప్‌శెట్టి వెల్లడించారు.
సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని సోషల్ మీడియాలో వీరు ప్రచారం చేశారు. దానిని నమ్మిన హైదరాబాద్‌కు చెందిన ప్రదీప్.. మల్లు శివశంకర్‌రెడ్డిని సంప్రదించాడు. వారు చెప్పిన ప్రకారం జనవరి 11న ప్రదీప్ బెంగళూరుకు వచ్చాడు. నిందితులు నలుగురూ అతన్ని కలిశారు. ఆ సమయంలో ప్రదీప్ నిందితులు వచ్చిన కారును తన ఫోన్‌లో ఫొటో తీసి సేవ్ చేసుకున్నాడు.
ఉద్యోగంలో చేరేందుకు కావాల్సిన పత్రాల కోసం రూ.30 వేలు ఇవ్వాలని నిందితులు చెప్పగా, ప్రదీప్ గూగుల్ పే యాప్ ఆ సమయంలో పనిచేయలేదు. దీంతో సమస్యేమిటో తెలుసుకునేందుకు ఫోన్ తీసుకున్న నిందితులు అందులో తాము వచ్చిన కారు ఫొటో ఉండటం చూసి.. అతన్ని ప్రశ్నించారు. అంతటితో ఆగక ప్రదీప్‌పై దాడిచేసి.. అతని ఖాతాలోని రూ.6 లక్షల నగదును బలవంతంగా తమ ఖాతాలోకి వేయించుకున్నారు. అనంతరం యలహంక ప్రాంతంలో అతన్ని దింపేసి వెళ్లిపోయారు.
ఈ ఘటనపై ప్రదీప్ కొడిగెహళ్లి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల దర్యాప్తులో డొంకంతా కదిలింది. మల్లు శివశంకర్‌రెడ్డి ఫేస్ బుక్ ఖాతాతో ఉద్యోగాల వ్యాపారం మొదలుపెట్టాడని వారు గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించడంతో మిగిలిన ముగ్గురి వివరాలూ వెల్లడించాడు. పోలీసులు నిందితుల ఖాతాల నుంచి రూ.5,95,585 నగదును డ్రా చేయకుండా చర్యలు తీసుకున్నారు. బెంగళూరు కోడిగెహళ్లి పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు.