Telugu Global
National

పెళ్లి... ఇకపై ఇలా చేద్దాం!

ఆశుతోష్, నిధి పెళ్లి చేసుకున్నారు. నిధి తల్లి చారులత, ఆశుతోష్‌ తల్లి అనుపమ ఇద్దరూ నేచర్‌ ఫ్రెండ్లీ లైఫ్‌ స్టయిల్‌ని ఇష్టపడేవాళ్లే. అశుతోష్, నిధిల పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి ఇద్దరు మ‌హిళ‌లు వివాహ వేడుకను ప్లాస్టిక్‌ ఫ్రీగా నిర్వహించారు.

పెళ్లి... ఇకపై ఇలా చేద్దాం!
X

తాటాకు పందిరి, మామిడాకు తోరణం, అరిటాకు భోజనం... ఇది ఒకప్పటి పెళ్లి వేడుక. ఇప్పటి పెళ్లిళ్లు మోడరన్‌ టచ్‌తో ఫంక్షన్‌హాల్‌లో ఏది సహజమో ఏది కృత్రిమమో తెలియకుండా అట్టహాసంగా జరుగుతున్నాయి. పెళ్లి తర్వాత ఫంక్షన్‌హాల్‌ను శుభ్రం చేసినప్పుడు చూస్తే టన్నుల కొద్దీ ప్లాస్టిక్‌ వ్యర్థాలు మనసును కలిచివేస్తాయి. డబ్బు ఉంది కదా అని విచక్షణరహితంగా సంస్కారహీనంగా వ్యవహరించామా అనే అపరాధభావం తొలిచివేస్తుంది. వేడుక అంటే ఇది కాదు, మేము చేస్తున్నాం చూడండి... అంటూ భూమితల్లికి కష్టం కలగని విధంగా తమ కూతురు, కొడుకు పెళ్లి చేశారు ఈ మహిళలు.

ఆశుతోష్, నిధి పెళ్లి చేసుకున్నారు. నిధి తల్లి చారులత, ఆశుతోష్‌ తల్లి అనుపమ ఇద్దరూ నేచర్‌ ఫ్రెండ్లీ లైఫ్‌ స్టయిల్‌ని ఇష్టపడేవాళ్లే. అశుతోష్, నిధిల పెళ్లి నిశ్చయమైనప్పటి నుంచి ఇద్దరూ వివాహ వేడుకను ప్లాస్టిక్‌ ఫ్రీగా నిర్వహించే పనిలో పడ్డారు. అరిటాకులో భోజనం వడ్డించారు. స్టీలు గ్లాసుల్లో నీటిని పోశారు. స్పూన్‌లు, ఫోర్కులు కూడా స్టీల్‌వే వాడారు. పెళ్లి మండపాన్ని సహజమైన పూలతో అలంకరించారు. భోజనాలు పూర్తయిన తర్వాత చెత్తను ఎక్కడ వేయాలో కూడా ముందుగానే ఆలోచించారు. పెద్ద డ్రమ్ముల్లో పావు వంతు కొబ్బరి పీచు వేసి సిద్ధంగా ఉంచారు. అరిటాకులను అందులో వేశారు. పేపర్‌ వేస్ట్‌ను విడిగా వేస్ట్‌ కలెక్షన్‌ సెంటర్‌కు తరలించారు. మండపాన్ని అలంకరించిన పూలను ముంబయిలోని సహజ రంగులు తయారు చేసి వస్త్రాలకు రంగులద్దే స్టూడియోకి పంపించారు. ఇది ప్లాస్టిక్‌ ఫ్రీ వెడ్డింగ్, అలాగే మినిమమ్‌ వేస్ట్‌ వెడ్డింగ్‌ కూడా. పూల బొకేలు, గిఫ్ట్‌ ర్యాపర్‌లు చుట్టిన బహుమతులు తీసుకురావద్దని తెలియచేశారు. ఈ ప్రయత్నం ద్వారా ద్వారా 30 వేల సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను నివారించగలిగారు. పెళ్లి వేడుక ఇలా నిర్వహించాలంటే ఫంక్షన్‌ హాల్‌లో డిష్‌ వాషర్‌ సౌకర్యం ఉంటే చాలన్నారు అనుపమ, చారులత.

First Published:  25 July 2023 10:34 AM IST
Next Story