జనసేన కార్యకర్తలపై తిరగబడ్డ మహిళలు
జగనన్న కాలనీల పరిశీలన పేరుతో వచ్చిన జనసేన కార్యకర్తలను స్థానిక మహిళలు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు వివాదం నెలకొన్నది.
జనసేన కార్యకర్తలకు మరోసారి ప్రజల నుంచి చుక్కెదురైంది. ఇప్పటం, పెడన గ్రామాల్లో ఇప్పటికే జనసేన శ్రేణులపై స్థానిక మహిళలు తిరగబడ్డారు. తాజాగా అనకాపల్లి జిల్లా గోలుగొండలో కూడా అదే పరిస్థితి ఎదురైంది. జగనన్న కాలనీల పరిశీలన పేరుతో వచ్చిన జనసేన కార్యకర్తలను స్థానిక మహిళలు అడ్డుకోవడంతో అక్కడ కాసేపు వివాదం నెలకొన్నది. ఇక్కడికి ఎవరు రమ్మన్నారంటూ ప్రశ్నించడంతో చేసేదేమీ లేక జనసేన కార్యకర్తలకు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
గోలుగొండలోని జగనన్న కాలనీకి వచ్చిన జనసేన కార్యకర్తలు బృందాలుగా విడిపోయి స్థానికులను ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇక్కడ అవినీతి జరిగిందని, రాజకీయ నాయకులు ఎంత డబ్బులు మీ దగ్గర నుంచి తీసుకున్నారని అడగడం ప్రారంభించారు. ఇళ్లు కట్టుకోవడానికి ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు సరిపోలేదని చెప్పాలని డిమాండ్ చేశారు. అంతే కాకుండా ప్రభుత్వం నుంచి మరింత సొమ్ము అడగాలని కోరారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టడం ప్రారంభించడంతో స్థానిక మహిళలు వారిని వారించారు.
లబ్ధిదారులందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చారని, ఇక్కడ ఎలాంటి అవినీతి జరగలేదని చెప్పారు. ఇక్కడకు వచ్చి అనవసరమైన రాజకీయాలు చేయవద్దని జనసేన కార్యకర్తలను హెచ్చరించారు. అసలు ఎలాంటి అవినీతికి తావు లేకుండా, రూపాయి కూడా తీసుకోకుండా మాకు ఇళ్లు కట్టించి ఇచ్చారని స్పష్టం చేశారు. అయినా, ప్రభుత్వం నుంచి డబ్బు అడగాలని చెప్పడానికి మీరెవరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలంటే మీరే ఒక లక్ష రూపాయలు ఇచ్చి వెళ్లండని చెప్పడంతో జనసేన కార్యకర్తలు బిక్కమొహం వేశారు. స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుండటంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడులోని జగనన్న కాలనీ వద్దకు జెండాలు పట్టుకొని వచ్చిన జనసేన కార్యకర్తలను స్థానికులు అడ్డుకున్నారు. ఇక్కడకు ఎందుకు జెండాలు పట్టుకొని వచ్చారని ప్రశ్నించారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లకపోతే.. పోలీసులకు న్యూసెన్స్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. దీంతో జనసేన కార్యకర్తలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.