అప్పు కట్టండి- సంఘంలో సగర్వంగా బతకండి- అఖిలప్రియ ఇంటి ముందు నిరసన
ఆయన మరణం తర్వాత వాయిదాలు చెల్లించకపోవడంతో వారసులకు బ్యాంకు సిబ్బంది పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందన లేకపోవడంతో సిబ్బంది ఇలా అఖిలప్రియ నివాసం ముందు నిరసనకు దిగినట్టు చెబుతున్నారు.
భూమా నాగిరెడ్డి మరణం తర్వాత వారి వారసులు ఏదో ఒక వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. భూమా నాగిరెడ్డి కుమార్తె, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ నివాసం ఎదుట బ్యాంకు సిబ్బంది నిరసన కార్యక్రమం నిర్వహించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. తీసుకున్న రుణం చెల్లించాలంటూ బ్యాంకు సిబ్బంది ప్లకార్డులతో ఆమె ఇంటి ముందు నిరసనకు దిగారు. బ్యాంకు సొమ్ము- ప్రజల సొమ్ము- అప్పు చెల్లించండి- సగర్వంగా సంఘంలో జీవించండి అంటూ ప్లకార్డులతో ధర్నా నిర్వహించారు.
భూమా నాగిరెడ్డి ఆళ్లగడ్డలో డెయిరీ కోసం గతంలో నంద్యాలలోని ఆంధ్రా బ్యాంకు నుంచి రుణం తీసుకున్నట్టు చెబుతున్నారు. ఆయన మరణం తర్వాత వాయిదాలు చెల్లించకపోవడంతో వారసులకు బ్యాంకు సిబ్బంది పలుమార్లు నోటీసులు ఇచ్చారు. అయినా స్పందన లేకపోవడంతో సిబ్బంది ఇలా అఖిలప్రియ నివాసం ముందు నిరసనకు దిగినట్టు చెబుతున్నారు. ఆ అప్పుకు ష్యూరిటీ ఇచ్చిన టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డికి చెందిన హోటల్ ముందు కూడా బ్యాంకు సిబ్బంది ఇదే తరహాలో నిరసనకు దిగారు.
తన నివాసం ముందు బ్యాంకు సిబ్బంది నిరసన తెలియజేస్తున్న విషయం తెలుసుకున్న భూమా అఖిలప్రియ వారితో ఫోన్‌లో మాట్లాడారు. కొద్దిగా గడువు ఇస్తే తాము స్పందిస్తామని విజ్ఞప్తి చేశారు. దాంతో బ్యాంకు వారు వెళ్లిపోయారు.