Telugu Global
Andhra Pradesh

సబ్బం హరి ఆస్తులు సీజ్

విశాఖ మాధవధార విష్ణువైభవంలోని అపార్ట్‌మెంట్‌ను బ్యాంకు అధికారులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. సీతమ్మధారలోని 1622 గజాల్లో ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు కూడా బ్యాంకు అధికారులు ఆయన కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేశారు.

సబ్బం హరి ఆస్తులు సీజ్
X

దివంగత మాజీ ఎంపీ సబ్బం హరి ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. తీసుకున్న రుణం తిరిగి చెల్లించకపోవడంతో విశాఖ కో-ఆపరేటివ్ బ్యాంకు అధికారులు నోటీసులు జారీ చేసిన అనంత‌రం ఆయనకు సంబంధించిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

విశాఖలో డెక్కన్ క్రానికల్ భవనాన్ని కోటక్ మహీంద్ర బ్యాంకు 2014లో వేలం వేసినప్పుడు 17.8కోట్ల రూపాయలకు సబ్బం హరి సొంతం చేసుకున్నారు. ఆ డబ్బు చెల్లించేందుకు గాను తన ఆస్తులను తాకట్టు పెట్టి విశాఖ కో- ఆపరేటివ్ బ్యాంకు నుంచి సబ్బం హరి 8.5 కోట్ల రూపాయల రుణం తెచ్చుకున్నారు.

అంతలో తమ భవనాన్ని సరైన పద్దతిలో వేలం వేయలేదంటూ డెక్కన్ క్రానికల్ సంస్థ కోటక్ మహీంద్ర బ్యాంకు తీరుకు వ్యతిరేకంగా డెట్ రికవరీ అప్పిలేట్‌లో కేసు వేసింది. పిటిషన్‌ను విచారించిన అప్పిలేట్ అథారిటీ కోటక్ మహీంద్ర చేపట్టిన వేలాన్ని రద్దు చేసింది. వేలంలో అప్పటికే భవనాన్ని సొంతం చేసుకున్న సబ్బంహరికి రూ.17.8 కోట్లు తిరిగి చెల్లించాలని కోటక్ మహీంద్ర బ్యాంకును ఆదేశించింది.

కానీ, కోటక్ మహీంద్ర బ్యాంకు.. అప్పిలేట్‌ అథారిటీ తీర్పును సవాల్ చేస్తూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌కు వెళ్లింది. అక్కడ కేసు పెండింగ్‌లో ఉండిపోయింది. ఇటు డెక్కన్ క్రానికల్ భవనాన్ని సొంతం చేసుకునేందుకు సబ్బం హరి తెచ్చిన అప్పుల వడ్డీ పెరిగిపోయింది. 2018లోనే విశాఖ కో- ఆపరేటివ్ బ్యాంకు సబ్బం హరికి నోటీసులు జారీ చేసింది. ఆ తర్వాత కరోనా సమయంలో సబ్బం హరి కన్నుమూశారు.

విశాఖ మాధవధార విష్ణువైభవంలోని అపార్ట్‌మెంట్‌ను బ్యాంకు అధికారులు సీజ్ చేసినట్టు తెలుస్తోంది. సీతమ్మధారలోని 1622 గజాల్లో ఉన్న ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు కూడా బ్యాంకు అధికారులు ఆయన కుటుంబసభ్యులకు నోటీసులు జారీ చేశారు. రుషికొండ వద్ద ఉన్న 800 చదరపు గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని నోటీసులు అందజేశారు.

First Published:  9 Sept 2022 3:10 AM GMT
Next Story