బ్యాంకు ఉద్యోగి.. దొంగగా మారాడు..
ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఉన్న నాగేశ్వరరావు.. అందులో తనకు వచ్చే జీతాన్నే కాక.. మరికొంత అప్పులు కూడా చేసి పోగొట్టుకున్నాడు. దీంతో చేసిన అప్పులు తీరేదారి లేక.. బ్యాంకులో ఓ లాకర్‌లోని బంగారాన్ని తస్కరించాడు.
అతనో బ్యాంకు ఎంప్లాయ్.. గౌరవ ప్రదమైన ఉద్యోగం.. మంచి జీతం.. మంచి జీవితాన్ని ఆనందంగా గడిపేందుకు అన్ని అవకాశాలూ ఉన్నా.. అతని ఒకే ఒక్క వ్యసనం అతని జీవితాన్నే తల్లకిందులు చేసింది. అతని పేరు చిటికెల నాగేశ్వరరావు. స్వస్థలం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం మండలం పీనారిపాలెం. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలు మండలాల్లో ఓ బ్యాంకు అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేసేవాడు. అంతా బాగుందనుకున్న తరుణంలో అతనికి ఉన్న బెట్టింగ్ వ్యసనం అతని జీవితాన్నే తలకిందులు చేసింది.
ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం ఉన్న నాగేశ్వరరావు.. అందులో తనకు వచ్చే జీతాన్నే కాక.. మరికొంత అప్పులు కూడా చేసి పోగొట్టుకున్నాడు. దీంతో చేసిన అప్పులు తీరేదారి లేక.. బ్యాంకులో ఓ లాకర్‌లోని బంగారాన్ని తస్కరించాడు. దానిని అమ్మి సొమ్ము చేసుకున్నాడు. ఈ క్రమంలో అతని బాగోతం బయటపడటంతో సస్పెండ్ అయ్యాడు.
అంతటితో ఆగక.. ఏలేశ్వరంలోని ఓ ఏటీఎంలో చోరీకి పాల్పడ్డాడు. ఆ తర్వాత మరింత దిగజారిపోయి.. ఇళ్ల దొంగతనాలకు తెగించాడు. అందుకోసం గతంలో ఏడాది పాటు కుటుంబంతో పాటు అద్దెకు ఉన్న ప్రాంతంలోని ఇంటినే టార్గెట్‌గా చేసుకున్నాడు. ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో అన్నవరంలోని సత్యదేవా జూనియర్ కళాశాల వెనుక భాగంలో ఉన్న ఇంట్లో అద్దెకు ఉంటున్న వీరభద్రరావు అనే వ్యక్తి ఇంటి తాళాలు పగలగొట్టి.. 33.8 కాసుల బంగారు ఆభరణాలు, 1.5 కేజీల వెండి వస్తువులు, రూ.50 వేల నగదు.. కలిపి మొత్తం రూ.22.4 లక్షల విలువైన సొత్తును దోచేశాడు. దర్యాప్తులో భాగంగా నిందితుడు నాగేశ్వరరావే అని గుర్తించిన పోలీసులు అతన్ని అరెస్టు చేశారు. అతని నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.