చెక్‌బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు ఏడాది జైలుశిక్ష
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని నాగులుప్పలపాడు మండలం మద్దిరాల ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు దగ్గర 2019లో బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు.
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్, కాంగ్రెస్ లీడర్ బండ్ల గణేష్‌కు కోర్టు షాకిచ్చింది. చెక్‌బౌన్స్ కేసులో ఆయనకు ఏడాది జైలు శిక్షతో పాటు ఏకంగా 95 లక్షల జరిమానా విధిస్తూ ఒంగోలు కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో అప్పీలు చేసుకునేందుకు బండ్ల గణేష్‌కు కోర్టు నెల రోజుల గడువు కూడా ఇచ్చింది.
95 లక్షల అప్పు తీసుకుని..
ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని నాగులుప్పలపాడు మండలం మద్దిరాల ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు దగ్గర 2019లో బండ్ల గణేష్ 95 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడు. అసలు, వడ్డీతో కలిపి కోటీ 20 లక్షల రూపాయలకు పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్స్ పేరుతో చెక్ ఇచ్చాడు. అది బౌన్స్ కావడంతో 2019లో వెంకటేశ్వర్లు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు విచారణ చేపట్టింది. అయితే ఎన్నిసార్లు పిలిచినా గణేష్ విచారణకు హాజరుకాలేదు. బుధవారం ఆయన ఒంగోలు కోర్టుకు హాజరయ్యారు. దీంతో బండ్లకు ఏడాది జైలుశిక్షతో పాటు భారీగా జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.
అరెస్టు వారంట్ దాకా వెళ్లింది
గతంలో ఈ కేసు విచారణకు హాజరుకావాలని కోర్టు బండ్ల గణేష్‌కు పలుసార్లు నోటీసులిచ్చినా ఆయన రాలేదు. దీంతో గతంలో కోర్టు బండ్ల గణేష్ మీద అరెస్టు వారెంటు జారీ చేయడం, ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు ఆయనను అరెస్టు చేసేందుకు హైదరాబాద్ కూడా వెళ్లడం అప్పట్లో సంచలనం సృష్టించింది.