Telugu Global
Andhra Pradesh

పవన్‌పై ఈగ వాలనివ్వని బండ్ల గణేష్.. అంబటి, గుడివాడపై వరుస ట్వీట్లు..!

పొలిటికల్‌గా పవన్‌ను ఎవరైనా విమర్శిస్తే వెంటనే స్పందించి కౌంటర్ అటాక్ చేస్తున్నాడు. నిన్న మంత్రి అంబటి రాంబాబుతో ట్వీట్ వార్ జరిపిన బండ్లన్న ఇవాళ మరో మంత్రి గుడివాడ అమర్ నాథ్‌కు కౌంటర్ ఇచ్చాడు.

పవన్‌పై ఈగ వాలనివ్వని బండ్ల గణేష్.. అంబటి, గుడివాడపై వరుస ట్వీట్లు..!
X

యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్‌కు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అంటే ఎంత అభిమానమో అందరికీ తెలుసు. పవన్ నా దేవుడు, నా దేవర అని కీర్తిస్తుంటాడు బండ్లన్న. పొద్దున లేచినప్పటి నుంచి పవన్ సినిమాలకు సంబంధించి ట్వీట్స్ చేస్తూ ఆయన అభిమానులకు దగ్గరయ్యే ప్రయత్నాల్లో ఉంటాడు. అయితే ఇప్పటి దాకా బండ్లన్న సినిమాలకు సంబంధించే పవన్‌ని అభిమానిస్తూ వచ్చాడు. అయితే రెండు రోజులుగా అతడు తన రూట్ మార్చాడు. పొలిటికల్‌గా పవన్‌ను ఎవరైనా విమర్శిస్తే వెంటనే స్పందించి కౌంటర్ అటాక్ చేస్తున్నాడు.

నిన్న మంత్రి అంబటి రాంబాబుతో ట్వీట్ వార్ జరిపిన బండ్లన్న ఇవాళ మరో మంత్రి గుడివాడ అమర్ నాథ్‌కు కౌంటర్ ఇచ్చాడు. 'చంద్రబాబు స్క్రిప్ట్, ప్రొడక్షన్‌లో, నాదెండ్ల మనోహర్ దర్శకత్వంలో పవన్ పార్టీ నడుపుతున్నాడని మంత్రి అమర్నాథ్ విమర్శలు చేశారు. మీది కాపు జనసేన కాదు.. కమ్మ జన సేన అంటూ' ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. మంత్రి అమర్నాథ్ అలా ట్వీట్ చేసారో లేదో బండ్లన్న ఇలా స్పందించాడు.

'పవన్ కల్యాణ్ జనసేన పార్టీ నడుపుతున్నది ప్రజల కోసం, ప్రజా శ్రేయస్సు కోసం ప్రజాజనసేన మంత్రి గారు' అంటూ ట్వీట్ చేశాడు. మొత్తానికి బండ్లన్న రెండు రోజులుగా పవన్‌పై ఈగ వాలకుండా చూసుకుంటున్నాడు. అయితే దీని వెనకాల ఉన్న పరమార్థం ఏంటా అని అంతా ఆలోచిస్తున్నారు.

పవన్‌ని ఎంతగానో ఆరాధిస్తున్న.. అని చెప్పే బండ్ల గణేష్ గత ఎన్నికలకు ముందు జనసేనను కాదని కాంగ్రెస్‌లో చేరాడు. పవన్‌ను అంతలా ఇష్టపడే మీరు కాంగ్రెస్‌లో చేరారేంటి.. అని మీడియా ప్రశ్నించగా 'సినిమా వేరు.. రాజకీయం వేరు' అంటూ బండ్లన్న నీతులు చెప్పాడు. ఇప్పుడు ఉన్నట్టుండి పొలిటికల్‌గా పవన్‌కి అండగా నిలుస్తున్నాడు. బహుశా జనసేన తరపున పోటీ చేసేందుకు.. ఆ పార్టీ లీడర్‌కు దగ్గర అయ్యేందుకే బండ్ల గణేష్ ఈ రూట్ ఎంచుకున్నాడన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

First Published:  17 Aug 2022 3:26 PM IST
Next Story