Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు, విజయసాయికి బండ్ల గణేష్ కౌంటర్.. ఒక్కటై ఏకిపారేసిన టీడీపీ, వైసీపీ శ్రేణులు

ఇదిలా ఉండగా తాజాగా నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ విజయసాయిరెడ్డి, చంద్రబాబు పక్క పక్కన కూర్చుని మాట్లాడుతున్న ఫొటో ట్విట్టర్లో పోస్ట్ చేశారు.

చంద్రబాబు, విజయసాయికి బండ్ల గణేష్ కౌంటర్.. ఒక్కటై ఏకిపారేసిన టీడీపీ, వైసీపీ శ్రేణులు
X

శివరాత్రి నాడు నందమూరి తారకరత్న కన్నుమూసిన సంగతి తెలిసిందే. నిన్న హైదరాబాద్ లో ఆయన భౌతిక కాయానికి పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. అయితే తారకరత్నకు నివాళి అర్పించేందుకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా హాజరయ్యారు. తన భార్య తరఫున తారకరత్న కుటుంబానికి బంధుత్వం ఉండడంతో ఆయన తారకరత్న చివరి చూపునకు వచ్చారు.

అయితే ఆ సమయంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు పక్కన కూర్చొని మాట్లాడటం ఆసక్తి కలిగించింది. నిత్యం ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే వారిద్దరూ పక్కపక్కన కూర్చొని కనిపించేసరికి అంతా ఆశ్చర్యపోయారు. బాలకృష్ణ, ఎన్టీఆర్ లతో కూడా విజయసాయిరెడ్డి మాట్లాడారు. ఇది రాజకీయంగా హాట్ టాపిక్ గా నిలిచింది.

ఇదిలా ఉండగా తాజాగా నటుడు, నిర్మాత అయిన బండ్ల గణేష్ విజయసాయిరెడ్డి, చంద్రబాబు పక్క పక్కన కూర్చుని మాట్లాడుతున్న ఫొటో ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఆ ఫొటోకు వ్యంగ్యంగా కామెంట్స్ చేశాడు. 'ప్రాణం పోయినా నేను శత్రువు అనుకున్న వాడితో ఈ విధంగా కూర్చొని మాట్లాడను, అవసరం వస్తే అక్కడ నుంచి వెళ్ళిపోతా అది నా నైజం. అత్యంత బాధాకరమైన విచిత్రం.. జనంలో విశ్వాసం కోల్పోవడానికి ఇలాంటి సంఘటనలే ఉదాహరణ. బతికితే సింహంలా బతకాలి, చచ్చిపోతే సింహంలా చచ్చిపోవాలి' అని బండ్ల గణేష్ ట్వీట్ చేశాడు.


అయితే బండ్ల గణేష్ చేసిన ట్వీట్ ఇటు వైసీపీ అటు టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించింది. చావు దగ్గర కూడా ఈ రాజకీయాలు ఏంటి? అని బండ్ల గణేష్ చేసిన ట్వీట్ పై వారు మండిపడుతున్నారు. మామూలుగా సోషల్ మీడియాలో ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే టీడీపీ, వైసీపీ శ్రేణులు ఒక్కటై బండ్ల గణేష్ ను ఏకిపారేశారు.

అక్కడ రెండు కుటుంబాలకు చెందిన ఒక వ్యక్తి చనిపోయారు.. పార్టీలకు అతీతంగా వచ్చి అందరూ నివాళులు అర్పిస్తున్నారు. అందులో ఏం తప్పు కనిపించింది బండ్లన్నా.. అని పలువురు ప్రశ్నించారు. రాజకీయాల్లో విధానపరమైన శత్రుత్వం ఉండాలి తప్ప.. కత్తులు పట్టుకొని తిరిగే స్థాయి శత్రుత్వం ఉండకూడదని మరికొందరు బండ్ల గణేష్ కు సూచించారు.

First Published:  20 Feb 2023 9:41 AM GMT
Next Story