ఏపీలో విజయోత్సవాలకు టపాకాయలు కూడా కరువే..
కొత్తగా వచ్చిన వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీలు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు.
దేశవ్యాప్తంగా జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. ఏపీకీ సంబంధించి అసెంబ్లీ, లోక్ సభ.. రెండింటి ఫలితాలు విడుదలవుతాయి. అయితే ఏపీలో విజయోత్సవాలు చేసుకునే పార్టీకి మాత్రం పెద్ద చిక్కొచ్చిపడింది. విజయోత్సవ ర్యాలీల్లో టపాకాయలకు కరువొచ్చే పరిస్థితి కనపడుతోంది. ఏపీలో నెలకొన్ని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఎక్కడికక్కడ పోలీస్ అధికారులు టపాకాయలపై నిషేధం విధించారు.
ఆమధ్య పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ అమ్మకుండా కొన్ని జిల్లాల ఎస్పీలు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. బాటిళ్లలో పెట్రోల్, డీజిల్ పోస్తే బంకుల లైసెన్స్ లు రద్దు చేస్తామంటూ కఠిన హెచ్చరికలు జారీ చేశారు. తాజాగా అనంతపురం జిల్లాలో టపాకాయలపై కూడా నిషేధం విధించారు జిల్లా ఎస్పీ గౌతమి శాలి. టపాకాయల తయారీ, నిల్వ, రవాణా, అమ్మకం కూడా జరగకూడదని స్పష్టం చేశారు. ఎవరైనా తన ఆదేశాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామనని హెచ్చరించారు.
ఏపీలో ఎన్నికల వేళ, ఆ తర్వాత కూడా హింస చెలరేగింది. ఆ మంటలు ఇంకా చల్లారలేదు, దీంతో ఇటీవల కొన్ని జిల్లాల ఎస్పీలపై బదిలీ వేటు పడింది. కొత్తగా వచ్చిన వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పల్నాడు, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో పరిస్థితి చేయిదాటకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీలు కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు. కౌంటింగ్ రోజున మరింత పగడ్బందీగా బందోబస్తు ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు విజయోత్సవాల పేరుతో రెచ్చగొట్టే చర్యలకు దిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు పోలీసులు. అసలు విజయోత్సవాల్లో టపాకాయలు కనిపించకుండా, వాటి సౌండ్లు వినిపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. జూన్ -6 వరకు టపాకాయల కొనుగోలు, అమ్మకాలను నిషేధించారు. మిగతా జిల్లాల్లో కూడా త్వరలో ఇలాంటి ఉత్తర్వులు వెలువడే అవకాశముంది.