ఒంగోలులో వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారిన బాలినేని.. మళ్లీ అలక!
వాస్తవానికి బాలినేని అలక వైసీపీకి కొత్త కాదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా మూడేళ్ల పాటు పెత్తనం చెలాయించారు.
ఒంగోలులో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యవహారశైలి ఇప్పుడు వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారిపోయింది. ఏడాది వ్యవధిలోనే మూడోసారి అలకబూనారు. ఒంగోలులో భూ కబ్జాదారులు అడ్డంగా సాక్ష్యాలతో దొరికిపోయినా.. వారిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని బాలినేని ఆరోపిస్తున్నారు. దాంతో భూములు కోల్పోయిన వారు ఆగ్రహంతో ఉన్నారని.. ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్న తనకు తెలియకుండా ఆ కబ్జాలు జరిగే అవకాశం లేదని ప్రజలు ఆరోపించడం బాధిస్తోందని బాలినేని చెప్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే గన్‌మెన్‌ను పోలీస్ శాఖకి సరెండర్ చేస్తూ డీజీపీకి లేఖ రాసిన బాలినేని.. ముఖ్యమంత్రి కార్యాలయానికి వచ్చి కార్యదర్శి ధనుంజయరెడ్డికి ఫిర్యాదు చేశారు. దాంతో విషయం సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్తానని ధనుంజయరెడ్డి హామీ ఇవ్వడంతో ఒంగోలుకి వెనుదిరిగారు.
అలక.. బుజ్జగింపులు.. మూడోసారీ సేమ్ సీన్
వాస్తవానికి బాలినేని అలక వైసీపీకి కొత్త కాదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్తు, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా మూడేళ్ల పాటు పెత్తనం చెలాయించారు. కానీ.. ఆ తర్వాత మంత్రి పదవి నుంచి తప్పించడంతో అలక మొదలైంది. తనని పదవి నుంచి తప్పించడం కంటే.. జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌ను కేబినెట్‌లో కొనసాగించడంతో హర్ట్ అయ్యారు. దాంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్వయంగా బాలినేని ఇంటికి వెళ్లి బుజ్జగించడంతో బెట్టువీడారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ప్రకాశం, బాపట్ల, నెల్లూరు జిల్లాల సమన్వయకర్తగా బాలినేనిని నియమించారు. అయితే.. సరైన కారణాలు బయటికి రాలేదుగానీ.. ఉమ్మడి ప్రకాశం జిల్లా బాధ్యతల నుంచి పూర్తిగా తప్పించి నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాలను ఆయనకి కేటాయించారు. దాంతో మళ్లీ బాలినేని అలక మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో మార్కాపురం పర్యటనకి వెళ్లిన సమయంలో సీఎం జగన్ స్వయంగా బాలినేనితో మాట్లాడి బుజ్జగించారు. దాంతో బెట్టువీడారు.
వాళ్లని అరెస్ట్ చేయకపోతే.. నాపై నిందలు
ఒంగోలులో రబ్బరు స్టాంపులు, రిజిస్ట్రేషన్ దస్తావేజులతో భూ కబ్జాలకు పాల్పడిన వారిపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవడం లేదని బాలినేని ప్రశ్నిస్తున్నారు. కబ్జాలకు పాల్పడిన వారిలో నా అనచరులు ఉన్నా.. చర్యలకు వెనుకాడొద్దని ఎస్పీకి చెప్పినా వెనుకంజ వేస్తున్నట్లు బాలినేని ఆరోపిస్తున్నారు. దాంతో నిందలు తాను మోయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్న బాలినేని.. ప్రతిపక్షాలు తనని భూ కబ్జాకోరుగా విమర్శిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముంగిట ఇలా ఆరోపణలు రావడంతో నియోజకవర్గంలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు వెల్లడించారు.
అలకలతో విసుగు..
బాలినేని మొదటి నుంచి వైఎస్ ఫ్యామిలీకి వీరవిధేయుడిగా ఉన్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి సీఎం జగన్ వెంట నడిచిన వారిలో బాలినేని కూడా ఒకరు. అన్నింటికీ మించి జగన్‌కి సమీప బంధువు. దాంతో బాలినేని చిన్నపిల్లాడిలా అలక వహిస్తూ పార్టీ పరువు తీస్తున్నా.. జగన్ ఇప్పటి వరకూ సహిస్తూ వస్తున్నారు. కానీ.. ఇదే పునరావృతమైతే.. మిగిలిన వాళ్లు కూడా గాడితప్పే ప్రమాదం ఉందని పార్టీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. గన్‌మెన్‌లను సరెండర్ చేయడం, పార్టీ పదవులకు మాటమాత్రం చెప్పకుండా రాజీనామా చేయడం, అలానే పార్టీకి చెడ్డపేరు వచ్చేలా బహిరంగ విమర్శలు చేయడాన్ని తప్పుబడుతున్నారు. మరి చూడాలి.. బాలినేని వ్యవహారంపై సీఎం జగన్ ఎలా స్పందిస్తారో..!