తగ్గేదే లేదు.. ఒంగోలు నుంచే పోటీ
పార్టీలో అయిన వాళ్లే కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చారు బాలినేని. మొదట్లో బాధపడ్డా, ఆ తర్వాత ఆలోచించానని, అలాంటి వారిని లెక్క చేయాల్సిన పనిలేదనిపించిందని అన్నారు.
వైసీపీలో నెల్లూరు పంచాయితీ అయిపోయిన తర్వాత ఇటీవల ఒంగోలు ఎపిసోడ్ మొదలైంది. ఒంగోలులో బాలినేని శ్రీనివాసులరెడ్డి అలక, బుజ్జగింపులు, ఆ తర్వాత ప్రెస్ మీట్ లో కన్నీళ్లు.. ఇవన్నీ తెలిసిందే. ఆ తర్వాత కొన్నిరోజులు సైలెంట్ గా ఉన్న బాలినేని మళ్లీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కానీ ఆయన స్వరం కాస్త మారింది. కంటతడి ఎపిసోడ్ నుంచి కాస్త కటువుగా మాట్లాడే వరకు వచ్చేశారు. వైసీపీలో తమ నాయకుడు సీఎం జగన్ ని మినహా ఇంకెవర్నీ లెక్క చేయాల్సిన పనిలేదంటున్నారు. తగ్గేదే లేదు ఈసారి కూడా ఒంగోలునుంచే పోటీ చేస్తానన్నారు బాలినేని.
అదంతా తప్పుడు ప్రచారం, కుట్ర..
ఈసారి బాలినేని ఒంగోలు నుంచి పోటీ చేయరని, ఆయనకు అధిష్టానం వేరే నియోజకవర్గం కేటాయిస్తుందనే ప్రచారం కొన్నిరోజులుగా ప్రకాశం జిల్లాలో ఉంది. ఇదంతా గిట్టనివారు చేస్తున్న ప్రచారం అంటూ మరోసారి మండిపడ్డారు మాజీ మంత్రి బాలినేని. మార్కాపురం, గిద్దలూరు, దర్శి నుంచి తాను పోటీ చేస్తానంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని, పార్టీలో అయిన వాళ్లే కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నారని చెప్పుకొచ్చారాయన. మొదట్లో బాధపడ్డా, ఆ తర్వాత ఆలోచించానని, అలాంటి వారిని లెక్క చేయాల్సిన పనిలేదనిపించిందని అన్నారు. తాను కేవలం తాను జగన్ ని మాత్రమే లెక్క చేస్తానన్నారు.
కార్యకర్తలే ముఖ్యం..
తనను ఐదుసార్లు ఒంగోలునుంచి గెలిపించిన కార్యకర్తలే తనకు ముఖ్యం అన్నారు బాలినేని. ఈసారి కూడా ఒంగోలునుంచే పోటీ చేస్తానన్నారు. కార్యకర్తల రుణం తీర్చుకుంటానని చెప్పారు. సీఎం జగన్ బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నారని, కానీ కార్యకర్తలను మాత్రం స్థానిక నాయకులు పట్టించుకోవడంలేదనే అసంతృప్తి ఉందని... దాన్ని తాను తొలగిస్తానన్నారు. కార్యకర్తలను వదిలిపెట్టనని, వారికోసమే తాను పనిచేస్తానన్నారు. పార్టీలో తనకు అయినవాళ్లు, కానివాళ్లు ఎవరూ లేరని.. తనకు కావాల్సింది కేవలం కార్యకర్తలేనన్నారు. ఒంగోలు నుంచే పోటీ చేస్తానంటూ కరాఖండిగా చెప్పేసిన బాలినేని, అధిష్టానానికి అల్టిమేట్టం ఇచ్చారా..? పార్టీలో జగన్ ని మాత్రమే లెక్కచేస్తానని చెబుతూ.. జగన్ తోనే తన పయనం అని పరోక్షంగా తేల్చేశారా..? ఆయనకే తెలియాలి.