Telugu Global
Andhra Pradesh

వైసీపీలో కోటంరెడ్డికి చెక్.. జగన్ ఫైనల్ డెసిషన్

పార్టీ మారబోతున్నట్టు శ్రీధర్ రెడ్డే చెప్పారు కదా అన్నారు బాలినేని. టీడీపీతో టచ్ లో ఉన్న కోటంరెడ్డి వైసీపీపై నిందలేయడం దేనికన్నారు. పార్టీ మారిన తర్వాత ఆయన బాధపడక తప్పదన్నారు.

వైసీపీలో కోటంరెడ్డికి చెక్.. జగన్ ఫైనల్ డెసిషన్
X

వైసీపీలో కోటంరెడ్డికి చెక్ పెట్టేసింది అధిష్టానం. ఆయన స్థానంలో రేపోమాపో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి కొత్త ఇన్ చార్జ్ ని ప్రకటించబోతున్నారు. ఈమేరకు నెల్లూరు జిల్లా వైసీపీ సమన్వయకర్త బాలినేని శ్రీనివాసులరెడ్డి క్లారిటీ ఇచ్చారు. కోటంరెడ్డి వ్యవహారంపై స్థానిక నాయకులతో చర్చించిన ఆయన జగన్ నిర్ణయం ఇదీ అంటూ కుండబద్దలు కొట్టారు.

బాధపడతావ్ కోటంరెడ్డీ..!

కోటంరెడ్డి విద్యార్థి దశనుంచి రాజకీయాలు చేస్తున్నా.. ఆయనకు వైసీపీయే తొలిసారి గుర్తింపు ఇచ్చిందని, రెండుసార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపించుకున్నామని చెప్పారు మాజీ మంత్రి బాలినేని. పార్టీ మారాలనుకుంటే మారొచ్చని, అయితే టీడీపీలో వెళ్లేక్రమంలో ఫోన్ ట్యాపింగ్ అంటూ నిందలు వేయడం సరికాదన్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదన్నారు. పార్టీ మారాలనే ఉద్దేశంతోటే ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఆడియో వైరల్..

ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని కోటంరెడ్డి అంటున్నారు కానీ, ఆయన ఫోన్ లో మాట్లాడిన ఆడియో ఒకటి ఉదయం నుంచి వైరల్ గా మారింది. ఆ ఆడియోలో ఆయన పార్టీ మారబోతున్నట్టు సన్నిహితులకు చెప్పారు. 2024లో నెల్లూరు రూరల్ నుంచి టీడీపీ తరపున పోటీ చేస్తున్నట్టు చెప్పారు. ఆ ఆడియో వ్యవహారంపై కూడా వైసీపీలో సీరియస్ గా చర్చ జరిగింది. పార్టీ మారబోతున్నట్టు శ్రీధర్ రెడ్డే చెప్పారు కదా అన్నారు బాలినేని. టీడీపీతో టచ్ లో ఉన్న కోటంరెడ్డి వైసీపీపై నిందలేయడం దేనికన్నారు. పార్టీ మారిన తర్వాత ఆయన బాధపడక తప్పదన్నారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తమ్ముడు గిరిధర్ రెడ్డిని తమ వద్దకు పంపించారని, ఆయనకు ఇన్ చార్జ్ పదవి ఇస్తే, అన్న పోటీ చేయడని తమకు చెప్పించారని అన్నారు బాలినేని. అంటే గిరిధర్ రెడ్డికి కూడా ఇన్ చార్జ్ పదవి దక్కదని తేలిపోయింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రెండు మూడు రోజుల్లో ఇన్ చార్జ్ ని నియమించే అవకాశాలున్నాయి. ఆనం విజయ కుమార్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మొత్తానికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎపిసోడ్ వైసీపీలో ముగిసిపోయిందనే చెప్పాలి.

First Published:  31 Jan 2023 2:21 PM GMT
Next Story