Telugu Global
Andhra Pradesh

జోకులు, సెల్ఫీలు.. ఏంది బాలయ్యా ఇది..?

బాలయ్య కూడా అంతే హుషారుగా వారితో మాట్లాడారు, జోకులేశారు, నవ్వించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్ గంభీరంగా మారగా, ఈరోజు మాత్రం బాలయ్య అంతా నవ్వులమయంగా మార్చేశారు.

జోకులు, సెల్ఫీలు.. ఏంది బాలయ్యా ఇది..?
X

చంద్రబాబు జైలులో ఉన్నారు. లోకేష్ మొహం పూర్తిగా వాడిపోయింది, కుటుంబ సభ్యులంతా దిగాలుగా ఉన్నారు. ప్రెస్ మీట్ లో అయినా, నాయకుల సమావేశంలో అయినా లోకేష్ అండ్ కో పూర్తిగా బాధతో కనపడుతున్నారు. మరి బాలయ్య పరిస్థితి ఏంటి...? నిన్న ప్రెస్ మీట్ లో జగన్ పై సంస్కృతంలో ధ్వజమెత్తిన ఆయన, ఈరోజు పార్టీ నాయకులతో జోకులేస్తూ సరదాగా గడిపారు. తనను కలవడానికి వచ్చిన నాయకులతో సరదాగా మాట్లాడారు. బావ జైలులో ఉన్నారన్న బాధ ఏమాత్రం ఆయనలో కనపడలేదు.

తన గుండె జగన్ జగన్ అని కొట్టుకుంటుంది అంటూ ఓ రేంజ్ లో ఆయన్ను మోసేసి, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించిన వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి, వచ్చే దఫా టీడీపీ తరపున పోటీ చేయాలనుకుంటున్నారు. ఇటీవల నారా లోకేష్ యువగళం యాత్రలో కూడా తన కుమార్తెలతో కలసి పాల్గొన్నారామె. చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆమె బాలయ్యను కలవడం విశేషం. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో తన కుమార్తెలతో సహా బాలయ్యను కలిశారు శ్రీదేవి. ఈ సందర్భంగా బాలయ్యతో సెల్ఫీలు దిగారు. బాలయ్య కూడా అంతే హుషారుగా వారితో మాట్లాడారు, జోకులేశారు, నవ్వించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత మంగళగిరి పార్టీ ఆఫీస్ గంభీరంగా మారగా, ఈరోజు మాత్రం బాలయ్య అంతా నవ్వులమయంగా మార్చేశారు.


బాలయ్య టేకోవర్..?

అప్పుడు ఉద్దేశపూర్వకంగా మామకు వెన్నుపోటు పొడిచి నందమూరి టీడీపీని, నారావారి టీడీపీ చేసుకున్నారు చంద్రబాబు. ఇప్పుడు చంద్రబాబు జైలుకి వెళ్లడంతో అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని బాలకృష్ణ ఉపయోగించుకుంటున్నారనే చర్చ నడుస్తోంది. పరామర్శలకు తాను వస్తున్నానని, ఇకపై పార్టీ కేడర్ కు తాను అండగా ఉంటానని చెబుతున్న బాలయ్య.. ఒకరకంగా పార్టీపై పెత్తనం కోరుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో ఉండవల్లి శ్రీదేవి సహా మరికొందరు నాయకులు బాలయ్యని కలవడం కూడా ఆసక్తికరంగా మారింది. యువగళాన్ని పక్కనపెట్టి లోకేష్ రాజమండ్రికే పరిమితం కాగా, బాలయ్య మాత్రం మంగళగిరి పార్టీ ఆఫీస్ లో హడావిడి చేస్తున్నారు.

First Published:  13 Sept 2023 3:15 PM IST
Next Story