హిందూపూర్‌లో బాలయ్య సందడి
హిందూపురం మండల పరిధిలోని చలివెందుల గ్రామంలో ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని బుధవారం బాలకృష్ణ దంపతులు ప్రారంభించారు.
సినిమావాళ్లు ప్రజాప్రతినిధులయితే.. రెండు పడవలపై ప్రయాణం కొంచెం కష్టమే. వాళ్లు ప్రాతినిథ్యం వహించే నియోజకవర్గాలను పట్టించుకోవడం కూడా అరుదే. అయితే నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ విషయంలో కాస్త విభిన్నంగా ఉంటారు. ఆయన నిత్యం సినిమాల్లో బిజీగా ఉన్నా.. సొంత నియోజకవర్గాన్ని కూడా అప్పుడప్పుడూ పట్టించుకుంటూ ఉంటారు. అక్కడ సొంతపార్టీ నేతల్లో నిత్యం విబేధాలు ఉన్నా కూడా ఆయన మాత్రం మొండి ధైర్యంతో ముందుకు వెళ్తుంటారు.
తాజాగా బాలకృష్ణ.. తన సతీమణి వసుంధరతో కలిసి హిందూపూర్ సెగ్మెంట్‌లో పర్యటించారు. హిందూపురం మండల పరిధిలోని చలివెందుల గ్రామంలో ఎన్టీఆర్ ఆరోగ్య రథాన్ని బుధవారం బాలకృష్ణ దంపతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. పార్టీలకు అతీతంగా చేసుకోవాల్సిన పండుగ రోజని పేర్కొన్నారు. రూ.40 లక్షల వ్యయంతో ఎన్టీఆర్ ఆరోగ్య రథం వాహనాన్ని తయారు చేశామన్నారు. ఈ మొబైల్ క్లినిక్‌లో అన్ని రకాల వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు.
200 వైద్య పరీక్షలు, ఉచితంగా మందులు అందజేస్తామన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరికరాలన్నీ నిరుపయోగంగా ఉన్నాయని మండిపడ్డారు. ఇలా ఉంటే ప్రజలకు మెరుగైన వైద్యం ఎలా అందుతుందని ప్రశ్నించారు. మొత్తానికి మంచి పనిచేసిన బాలకృష్ణను నియోజకవర్గ ప్రజలు మెచ్చుకుంటున్నారు.