బాబు సీట్లో బాలయ్య.. టీడీపీ ఆఫీస్‌లో ఆసక్తికర సన్నివేశం
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎలాగైనా తండ్రిని బయటకు తీసుకురావాలని లోకేష్ కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టు వ్యవహారం ఆంధ్రరాష్ట్రంలో హాట్ టాపిక్. అయితే తాజాగా చంద్రబాబు వియ్యంకుడు, ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి బాబు కుర్చీలో కూర్చుని పరిస్థితిని సమీక్షించిన సన్నివేశం ఇప్పుడు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది.
జైల్లో బాబు.. కోర్టుల చుట్టూ లోకేశ్
స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఎలాగైనా తండ్రిని బయటకు తీసుకురావాలని లోకేష్ కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బాలయ్య నేరుగా టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌కు రావడం ఎవరికీ ఆశ్చర్యం కలిగించలేదు కానీ, ఆయనే అధ్యక్షత వహించి పార్టీ నేతలతో సమావేశం కావడం మాత్రం చాలా ప్రాధాన్యాంశంగా మారింది. బాబు జైల్లో ఉన్న నేపథ్యంలో లోకేష్ కేసు వ్యవహారాలను పరిశీలిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీని తాత్కాలికంగా నడిపించడానికి బాలయ్య సిద్ధమయ్యారా అని ఆయన అభిమానులు చర్చించుకుంటున్నారు.
సీనియర్ నేతలు చాలామంది ఉన్నా కూడా
సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, షరీఫ్, పంచుమర్తి అనురాధ వంటి వారితోపాటు ఇటీవల బాగా వార్తల్లో ఉంటున్న పట్టాభిరామ్, అశోక్‌బాబు లాంటి వాళ్లు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే బాలకృష్ణే సమావేశానికి అధ్యక్షత వహించి చర్చించారు. బాబు అరెస్టు తర్వాత నిన్న ఏపీలో టీడీపీ బంద్ చేసింది. దీన్ని మరింత ముందుకు ఎలా తీసుకెళ్లాలా అని బాలకృష్ణ పార్టీ నేతలతో చర్చించినట్లు చెబుతున్నారు.
బాబుకు బీపీ పెరిగిపోతుందేమో!
రెండుసార్లుగా ఎమ్మెల్యేగా ఉన్నా బాలకృష్ణ మంగళగిరిలోని టీడీపీ సెంట్రల్ ఆఫీస్‌కు వచ్చిన సందర్భాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు. ఇప్పుడు నేరుగా ఆఫీస్‌కు వచ్చి తన సీట్లోనే కూర్చున్నారని తెలిస్తే చంద్రబాబుకు జైల్లో ఉన్నాననే బాధ కంటే బాలయ్య తన సీటుకు ఎసరు పెడుతున్నాడా అనే ఆందోళనే ఎక్కువైపోతుందన్న కామెంట్లూ సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఇక వైసీపీ నాయకులైతే బాబుకు శిక్షపడి జైలుకెళితే పార్టీకి బాలకృష్ణే దిక్కా అని కామెంట్ చేస్తున్నారు.