Balakrishna: అక్కినేనిపై వ్యాఖ్యలకు బాలకృష్ణ వివరణ
Balakrishna: పొగడ్తలకు పొంగిపోవద్దనే మాట ఆయన నుంచే నేర్చుకున్నానని వివరించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్ట్రీకి రెండు కళ్లు అని బాలకృష్ణ తెలిపారు.
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత అక్కినేని నాగేశ్వరరావుపై ఇటీవల చేసిన వ్యాఖ్యలకు సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ గురువారం వివరణ ఇచ్చారు. అక్కినేని నాగేశ్వరరావును కించపరిచేలా తాను మాట్లాడలేదని బాలకృష్ణ చెప్పారు. అవి యాదృచ్ఛికంగా అన్న మాటలే తప్ప కావాలని అనలేదని ఆయన తెలిపారు. అక్కినేని నాగేశ్వరరావును తాను బాబాయ్ అని పిలుస్తానని ఈ సందర్భంగా బాలకృష్ణ గుర్తుచేశారు.
అక్కినేని నాగేశ్వరరావు తన పిల్లలకంటే ఎక్కువగా తనపైనే ప్రేమ చూపించేవారని బాలకృష్ణ వివరించారు. బాబాయ్‌పై ప్రేమ తన గుండెల్లో ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. పొగడ్తలకు పొంగిపోవద్దనే మాట ఆయన నుంచే నేర్చుకున్నానని వివరించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ఇండస్ట్రీకి రెండు కళ్లు అని బాలకృష్ణ తెలిపారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ మాట్లాడుతూ `అక్కినేని తొక్కినేని..` అని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ విషయం తీవ్రంగా వైరలైంది. బాలకృష్ణ వ్యాఖ్యలపై అక్కినేని నాగేశ్వరరావు మనవళ్లు నాగ చైతన్య, అఖిల్ ఘాటుగా రిప్లయ్ ఇచ్చిన విషయం కూడా తెలిసిందే. అంతేగాక అక్కినేని అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. తాను చేసిన వ్యాఖ్యలకు బాలకృష్ణ క్షమాపణ చెప్పాల్సిందేనని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా బాలకృష్ణ ఈ వివరణ ఇచ్చారు.