Telugu Global
Andhra Pradesh

కుటుంబసభ్యుల నుంచే బాబుకు ప్రాణహాని ఉండొచ్చు.. - కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. తన కన్న తండ్రి ఎన్‌టీ రామారావును ఆనాడు తన భర్త చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారంలో నుంచి దించేసి చివరికి ఆయన చావుకు కారణమైనా స్పందించలేదని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు.

కుటుంబసభ్యుల నుంచే బాబుకు ప్రాణహాని ఉండొచ్చు.. - కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు
X

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే ప్రాణహాని ఉండొచ్చని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెంటపాడులో శనివారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొట్టు సత్యనారాయణ ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ప్రాణాలకు ఆయన కుటుంబ సభ్యుల నుంచే హాని ఉండొచ్చని చెప్పారు. ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ సినిమాలో జరిగినట్టే జరిగే అవకాశం లేకపోలేదని అనుమానాలు వ్యక్తం చేశారు.

పవన్‌ కళ్యాణ్‌ నటించిన ‘కెమెరామెన్‌ గంగతో రాంబాబు’ సినిమాలో ఒక మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు మధ్య జరిగే సన్నివేశాలను ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి పాత్రధారిని కొడుకే చంపేయడం ద్వారా ఆ సానుభూతితో తాను ముఖ్యమంత్రి కావాలనే ప్రయత్నం చేస్తాడు. దీనిని గుర్తుచేస్తూ.. ప్రస్తుతం చంద్రబాబును ఆయన కుటుంబీకులే కుట్ర చేసి అంతం చేస్తారనే భయం తనకు ఉందన్నారు.

చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.. తన కన్న తండ్రి ఎన్‌టీ రామారావును ఆనాడు తన భర్త చంద్రబాబు వెన్నుపోటు పొడిచి అధికారంలో నుంచి దించేసి చివరికి ఆయన చావుకు కారణమైనా స్పందించలేదని ఈ సందర్భంగా మంత్రి గుర్తుచేశారు. తాజాగా రాజమండ్రి సెంట్రల్‌ జైలులో ఉన్న చంద్రబాబునాయుడు పూర్తి ఆరోగ్యంగా ఉంటే.. ఆయనకు ఆరోగ్యం బాగోలేదని, 5 కేజీల బరువు తగ్గిపోయారని భువనేశ్వరి ప్రకటించడం, అలాగే చంద్రబాబు కుమారుడు నారా లోకేశ్‌ తన తండ్రికి జైలులో ప్రాణహాని ఉందంటూ ప్రకటించడం చూస్తుంటే.. తనకు ఈ అనుమానాలు కలుగుతున్నాయని మంత్రి వివరించారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే లోకేష్, భువనేశ్వరి బాధ్యత వహించాలని ఈ సందర్భంగా మంత్రి కొట్టు సత్యనారాయణ హెచ్చరించారు.

First Published:  14 Oct 2023 2:46 PM IST
Next Story