Telugu Global
Andhra Pradesh

ఇంకా సిట్ కార్యాలయంలోనే చంద్రబాబు.. సుదీర్ఘ విచారణకు బాబు చేసిన హంగామానే కారణమా?

ప్రస్తుతం చంద్రబాబును స్టేట్మెంట్‌ను రికార్డు చేసే పనిలో ఉన్నారు. సీఐడీ అధికారులు అడిగే ప్రశ్నలకు ఆయన తెలియదని, నాకు గుర్తులేదని సమాధానం ఇస్తున్నట్లు సమాచారం.

ఇంకా సిట్ కార్యాలయంలోనే చంద్రబాబు.. సుదీర్ఘ విచారణకు బాబు చేసిన హంగామానే కారణమా?
X

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో శనివారం ఉదయం నంద్యాలలో అరెస్టు అయిన మాజీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును సీఐడీ అధికారులు ప్రస్తుతం విచారిస్తున్నారు. నంద్యాల నుంచి రోడ్డు మార్గంలో ఆయనను కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తరలించారు. సాయంత్రం 5 గంటలకు చేరుకున్న చంద్రబాబును సీఐడీ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తున్నారు. ఇప్పటికే ఒక సారి నంద్యాలలో చంద్రబాబుకు వైద్య పరీక్షలు కూడా పూర్తి చేసిన అధికారులు.. సీబీఐ కోర్టులో ప్రవేశపెడతారని అందరూ భావించారు.

కానీ సీఐడీ అధికారులు ఈ విషయంపై ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు స్టేట్మెంట్‌ను రికార్డు చేసే పనిలో సీఐడీ అధికారులు ఉన్నారు. సీఐడీ అధికారులు అడిగే ప్రశ్నలకు ఆయన తెలియదని, నాకు గుర్తులేదని సమాధానం ఇస్తున్నట్లు సమాచారం. చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్టు చేసినట్లు సీఐడీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. దీంతో బాబును కోర్టులో ప్రవేశపెట్టడానికి రేపు ఉదయం వరకు సమయం ఉంది.

చంద్రబాబును సిట్ కార్యాలయంలోని ఐదో అంతస్తులో విచారిస్తుండగా.. బాబును కలవడానికి వచ్చిన భార్య భువనేశ్వరి, కొడుకు లోకేశ్, కోడలు బ్రాహ్మణి, వియ్యంకుడు బాలకృష్ణ నాలుగో అంతస్తులో వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబును ఇంత సుదీర్ఘంగా విచారణ పేరుతో సీఐడీ అధికారులు కార్యాలయంలో కూర్చోబెట్టడంపై కుటుంబ సభ్యులు, టీడీపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సీఐడీ అధికారులు కావాలనే ఇలా చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. అయితే, ఈ ఆలస్యానికి చంద్రబాబు నంద్యాలలో చేసిన హంగామానే కారణమని సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబును ఉదయం 6 గంటలకు అరెస్టు చేసిన తర్వాత హెలికాప్టర్‌లో అమరావతికి తరలిస్తామని చెప్పారు. ఎయిర్ లిఫ్ట్ చేస్తే తనకు తగినంత మైలేజీ రాదని భావించిన చంద్రబాబు.. రోడ్డు మార్గం ద్వారానే వస్తానని చెప్పినట్లు తెలుస్తున్నది. రోడ్డు మార్గం ద్వారా వస్తే నంద్యాల నుంచి అమరావతి వరకు ప్రజలు తనకు హారతులు పడతారని, టీడీపీ శ్రేణులు హడావిడి చేస్తాయని అంచనా వేసుకున్నారు. అయితే ఏపీ పోలీసులు ముందస్తుగా తీసుకున్న చర్యలతో అలాంటివి ఏవీ జరగలేదు.

కాగా, చంద్రబాబు చేసిన ఆలస్యం కారణంగా ఆయనకు ఒక ఉపకారం మాత్రం జరిగింది. నంద్యాల నుంచి అమరావతి వచ్చే లోపు ఢిల్లీ నుంచి కాస్ట్‌లీ లాయర్లను పిలిపించుకోగలిగారు. అంతే కాకుండా టీడీపీ లీగల్ సెల్ కేసులో బెయిల్ ఎలా ఇప్పించాలి? చంద్రబాబును రిమాండ్‌కు పంపకుండా ఏం చేయాలనే విషయంపై ఆలోచించుకునే అవకాశం లభించింది. చంద్రబాబు హెలికాప్టర్‌లో వచ్చి ఉంటే.. ఉదయం 9 గంటలకల్లా అమరావతిలో ఉండేవారు. సాయంత్రంలోపు ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉండేది. కానీ రోడ్డు మార్గంలో వచ్చి చంద్రబాబే కావాలని ఆలస్యం చేసినట్లు సీఐడీ వర్గాలు చెబుతున్నాయి.

చంద్రబాబు స్టేట్మెంట్ రికార్డు చేయడం పూర్తయితే ఆయనను ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెడతారు. జడ్జి ఇంటికే చంద్రబాబును తీసుకొని వెళ్తారు. అంతకు ముందు వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తారు. దీని కోసం ఇప్పటికే ఒక కాన్వాయ్‌ని సిద్ధం చేశారు.


First Published:  9 Sept 2023 4:16 PM GMT
Next Story