అయ్యన్న సలహా వింటారా?
చివరి నిమిషం వరకు అభ్యర్థులను ప్రకటించకుండా, బీఫారాలను ఇవ్వకపోతే పార్టీ నష్టపోతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబుకు అయ్యన్నపాత్రుడు గట్టిగానే చెప్పారు.
చంద్రబాబు నాయుడుకు మా చెడ్డ అలవాటు ఒకటుంది. అదేమిటంటే నియోజకవర్గంలో ఒకనేతకు టికెట్ ఇవ్వాలని డిసైడ్ అయినా చివరి నిమిషం వరకు టికెట్ ఇస్తున్నట్లు ప్రకటించరు, బీఫారం ఇవ్వరు. ప్రతి ఎన్నికలోనూ అభ్యర్థుల ప్రకటన, బీఫారాలను అందించే విషయంలో చంద్రబాబు ఇలాగే వ్యవహరిస్తారు. సీనియర్ నేతలు ఈ విషయంలో చంద్రబాబును ఎన్నిసార్లు తప్పుపట్టినా ఆయన తీరైతే మారటం లేదు.
నామినేషన్ వేయటానికి 24 గంటలు మాత్రమే టైం ఉందనగా అప్పుడు అభ్యర్ధులను ప్రకటించి, బీఫారంలను అందించిన ఎన్నికలు చాలానే ఉన్నాయి. ఉదాహరణకు నర్సీపట్నం నియోజకవర్గాన్నే తీసుకుందాం. ఇక్కడి నుండి చింతకాయల అయ్యన్నపాత్రుడు మాత్రమే పోటీ చేస్తారన్న విషయం అందరికీ తెలుసు. అయ్యన్నకు పోటీగా మరోనేత ఎవరూ టికెట్ రేసులో ఉండరు. అయినా సరే చివరి నిమిషం వరకు అయ్యన్నకు టికెట్ ప్రకటించరు, బీఫారాన్ని ఇవ్వరు.
శనివారం పార్టీ ఆఫీసులో జరిగిన విస్తృత స్ధాయి సమావేశంలో అయ్యన్న ఇదే విషయాన్ని నొక్కిమరీ చెప్పారు. నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఫైనల్ అయిపోయిన చోట్ల ముందుగానే ఆ విషయాన్ని ప్రకటించటమే కాకుండా బీఫారం కూడా ఇచ్చేయాలని చంద్రబాబుకు సూచించారు. చివరి నిమిషం వరకు అభ్యర్థులను ప్రకటించకుండా, బీఫారాలను ఇవ్వకపోతే పార్టీ నష్టపోతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చంద్రబాబుకు గట్టిగానే చెప్పారు. పాత పద్ధతిని మార్చుకుని రాబోయే ఎన్నికల్లో అభ్యర్థులను ముందే ప్రకటించేసి బీఫారాలు ఇచ్చేయాలని చెప్పారు. అయ్యన్న చెప్పారని కాదుకానీ చంద్రబాబు కూడా పాత పద్ధతులను మార్చుకోవాలనే అనుకున్నట్లున్నారు.
ఇందులో భాగంగా ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. అయితే చివరి నిమిషం వరకు వాళ్ళే అభ్యర్థులుగా ఉంటారని, వాళ్ళే పోటీ చేస్తారని నమ్మేందుకు లేదు. ఎందుకంటే చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చేసిన చరిత్ర కూడా చంద్రబాబుకుంది. బీఫారం చేతికొచ్చేంత వరకు టీడీపీలో చాలా మందికి సీట్లు గ్యారెంటీ ఉండదు. చంద్రబాబు విషయం అయ్యన్నకు బాగా తెలుసు కాబట్టే ఇంత గట్టిగా చెప్పారు. ఇప్పటికి 128 నియోజకవర్గాలను చంద్రబాబు సమీక్షిస్తే సుమారు 20 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. మరి వీళ్ళల్లో ఎంత మంది పోటీ చేస్తారో చూడాల్సిందే.