మహ్మద్ అక్బర్ అలియాస్ వివేకా.. అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
వివేకా గుండెపోటుతో చనిపోయాడని తానెప్పుడూ చెప్పలేదన్నారు అవినాష్ రెడ్డి. అప్పటి టీడీపీ ప్రభుత్వం అలా చిత్రీకరించిందన్నారు. వివేకా కుటుంబ సభ్యులు చెబితేనే తాను ఘటనా స్థలానికి వెళ్లానన్నారు
2019 మార్చి-15న వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిన తర్వాత ఇప్పటి వరకూ ఆయన వ్యక్తిగత విషయాలపై పెద్ద స్థాయి నాయకులెవరూ మాట్లాడలేదు. కానీ ఈరోజు సీబీఐ విచారణ అనంతరం కడప ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోదరి సునీత తనపై ఎన్ని విమర్శలు చేసినా మౌనంగానే ఉన్నానని, ఈ విషయంలో వైసీపీ కార్యకర్తలు అయోమయంలో ఉన్నారని, అందుకే తాను ఇప్పుడు నోరు తెరుస్తున్నానని చెప్పారు. ఇకపై తాను కూడా అన్నీ మాట్లాడతానన్నారు.
రాజకీయ కుట్ర..
మూడోసారి సీబీఐ విచారణకు హాజరైన అవినాష్ రెడ్డి, కేసు విచారణ వెనక రాజకీయ కుట్రలున్నాయని అన్నారు. తప్పుడు ఆధారాలు సృష్టించి విచారణను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. కుట్రలకు ఉపయోగపడే స్టేట్ మెంట్లు మాత్రమే తీసుకుంటున్నారని, ఈ కేసుకు సంబంధించి కీలకమైన అంశాలను పక్కన పెట్టి, చిన్నచిన్న విషయాలను ప్రస్తావిస్తూ పెద్దవి చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. కంచె చేను మేసినట్టుగా సీబీఐ విచారణ సాగుతోందన్నారు.
ఆయన పేరు మహ్మద్ అక్బర్..
వివేకా కుటుంబంలో అంతర్గత విభేదాలున్నాయని చెప్పారు అవినాష్ రెడ్డి. వివేకానందరెడ్డికి 2006 నుంచి మరో మహిళతో సంబంధం ఉందని, 2011లో ఆమెను పెళ్లి కూడా చేసుకున్నట్టు చెబుతారని అన్నారు అవినాష్ రెడ్డి. ఆమెను వివాహం చేసుకోవడానికి ఇస్లాం లా ప్రకారం వివేకా అనే పేరుని షేక్ మహమ్మద్ అక్బర్ గా మార్చుకున్నారని చెప్పారు. వారికి షెహన్ షా అనే అబ్బాయి కూడా ఉన్నాడని, భవిష్యత్తులో ఆ అబ్బాయిని రాజకీయ వారసుడిగా వివేకా ప్రకటించాలనుకున్నారని చెప్పారు.
నాకోసం ప్రచారం చేసిన వ్యక్తిని నేను ఇబ్బంది పెడతానా..?
కడప ఎంపీ టికెట్ కోసమే ఈ హత్య జరిగిందని చేస్తున్న ఆరోపణలు వింటే నవ్వొస్తుందన్నారు అవినాష్ రెడ్డి. చనిపోయే ముందు రోజు కూడా మైదుకూరు నియోజకవర్గం చాపాడు మండలంలో వైఎస్ వివేకానందరెడ్డి తనకోసం ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారని గుర్తు చేశారు. హత్యకు సంబంధంచిన నిజాలను వెలికితీయాలనే ఆలోచన సీబీఐకి లేదని, కట్టుకథను అడ్డు పెట్టుకొని, ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని విచారణ చేస్తున్నారని, అది సరైన పద్ధతి కాదన్నారు.
వివేకా గుండెపోటుతో చనిపోయాడని తానెప్పుడూ చెప్పలేదన్నారు అవినాష్ రెడ్డి. అప్పటి టీడీపీ ప్రభుత్వం అలా చిత్రీకరించిందన్నారు. వివేకా కుటుంబ సభ్యులు చెబితేనే తాను ఘటనా స్థలానికి వెళ్లానన్నారు. వివేకా హత్య జరిగిన స్థలంలో ఒక లేఖ ఉందని, ఆ లేఖను వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త రాజశేఖర్ దాచిపెట్టారన్నారు. లేఖను, సెల్ ఫోన్ ను దాచిపెట్టడం తప్పు కాదా? అని ప్రశ్నించారు. ఈ కేసు విషయంలో తాను న్యాయపరంగానే ముందుకు వెళ్తానన్నారు అవినాష్ రెడ్డి.