తెలంగాణ హైకోర్ట్ లో అవినాష్ రెడ్డికి ఊరట..
అవినాష్ సీబీఐ విచారణకు సహకరించడంలేదని, నోటీసులిచ్చినా సాకులు చెప్పి విచారణకు రావడం లేదని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకి సంబంధించి కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఈనెల 31(బుధవారం) వరకు అరెస్ట్ చేయొద్దని సీబీఐకి సూచించింది తెలంగాణ హైకోర్టు. అదే రోజు ముందస్తు బెయిల్ పై తుదితీర్పు ఇస్తామని తెలిపింది. అంతవరకు ఆయన్ను అరెస్ట్ చేయొద్దని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ అరెస్ట్ పై వారం రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు ప్రస్తుతానికి బ్రేక్ పడినా వచ్చే బుధవారం కోర్టు తీర్పుతో పూర్తి స్థాయిలో సస్పెన్స్ కి తెరపడే అవకాశముంది.
అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న హైకోర్టు, బుధవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సీబీఐకి ఆదేశాలు జారీ చేసింది. అవినాష్ రెడ్డి తల్లి అనారోగ్యం కారణంగా అరెస్ట్ చేయొద్దని పేర్కొంది. అవినాష్ సీబీఐ విచారణకు సహకరించడంలేదని, నోటీసులిచ్చినా సాకులు చెప్పి విచారణకు రావడం లేదని సీబీఐ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ కుమార్ రెడ్డి కూడా విచారణకు సహకరించలేదని కోర్టుకు విన్నవించారు.
అవినాష్ తల్లిదండ్రులిద్దరూ..
అవినాష్ తల్లిని ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అవినాష్ తండ్రి కూడా సడన్ గా అస్వస్థతకు గురికావడంతో ఆయన్ను కూడా ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియాలో చికిత్స అనంతరం తిరిగి చంచల్ గూడ జైలుకి తీసుకు రాగా.. తిరిగి అస్వస్థతకు గురికావడంతో ఈరోజు ఆయన్ను నిమ్స్ లో అడ్మిట్ చేశారు. ఆయనకు వైద్య పరీక్షలతోపాటు యాంజియోగ్రామ్ చేస్తారని చెబుతున్నారు.