Telugu Global
Andhra Pradesh

భుజాల మీద ఎత్తుకుని పెంచా.. చున్నీ లాగుతానా..? ఏవీ సుబ్బారెడ్డి ఎమోషనల్

‘‘భూమా అఖిల ప్రియా.. నేను నిన్ను భుజాల మీద ఎత్తుకుని పెంచాను. నీ చున్నీని నేను లాగాను అనడం దారుణం. భూమా నాగిరెడ్డి ఏ మీటింగ్‌లో మాట్లాడినా భూమా, ఏవీ ఫ్యామిలీ వేర్వేరు కాదని ఎన్నోసార్లు చెప్పారు’’

భుజాల మీద ఎత్తుకుని పెంచా.. చున్నీ లాగుతానా..? ఏవీ సుబ్బారెడ్డి ఎమోషనల్
X

భుజాల మీద ఎత్తుకుని పెంచా.. చున్నీ లాగుతానా..? ఏవీ సుబ్బారెడ్డి ఎమోషనల్

మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య వివాదం మరింత ముదిరింది. ఇటీవల నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఇద్దరూ పోటాపోటీగా స్వాగత ఏర్పాట్లు చేస్తూ గొడవపడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భూమా అఖిల ప్రియ వర్గీయులు ఏవీ సుబ్బారెడ్డిని రక్తం వచ్చేలా కొట్టారు. దాంతో అతను కేసు పెట్టడం.. భూమా అఖిల ప్రియని అరెస్ట్ చేయడం చకచకగా జరిగిపోయాయి. ప్రస్తుతం బెయిల్‌పై బయటికి వచ్చిన అఖిల ప్రియ ప్రెస్‌మీట్లు పెట్టి మరీ సంచలన ఆరోపణలు గుప్పిస్తోంది.

ఏవీ సుబ్బారెడ్డి తనని వెనుక నుంచి తోసేశారని.. కళ్లు కనిపించడం లేదా అని ప్రశ్నించినందుకు అందరి ముందు తన చున్నీ లాగాడని భూమా అఖిల ప్రియ ఆరోపిస్తోంది. చున్నీ లాగినందుకే కార్యకర్తలు అతడ్ని కొట్టారని తాను ఏమీ అనలేదని చెప్పుకొచ్చారు. అంతేకాదు తనని ఆళ్లగడ్డ రాజకీయాలకి దూరంగా ఉంచాలని కొందరు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అఖిల ప్రియ.. తీహార్ జైల్లో పెట్టినా కూడా నామినేషన్ వేసి గెలుస్తానని సవాల్ చేశారు. అఖిల ప్రియ ఆరోపణలపై ఏవీ సుబ్బారెడ్డి ఎమోషనల్‌గా స్పందించారు.

‘‘భూమా అఖిల ప్రియా.. నేను నిన్ను భుజాల మీద ఎత్తుకుని పెంచాను. నీ చున్నీని నేను లాగాను అనడం దారుణం. భూమా నాగిరెడ్డి ఏ మీటింగ్‌లో మాట్లాడినా భూమా, ఏవీ ఫ్యామిలీ వేర్వేరు కాదని ఎన్నోసార్లు చెప్పారు’’ అని ఏసీ సుబ్బారెడ్డి ఎమోషనల్ అయ్యారు. నారా లోకేష్ పాదయాత్రలో స్వాగతం పలికేందుకు వేర్వేరుగా టెంట్ వేసి గ్రూప్ రాజకీయాలకి తెరతీసింది భూమా అఖిల ప్రియనే అని సుబ్బారెడ్డి ఆరోపించారు. ఇప్పుడు తాను తలుచుకుంటే ఆళ్లగడ్డలో పార్టీ ఆఫీస్ పెట్టగలనని.. కానీ టీడీపీ సిద్ధాంతాలకి కట్టుబడి మౌనంగా ఉంటున్నట్లు వెల్లడించారు.

అఖిల ప్రియ ఆరోపించినట్లు తాను తప్పు చేసి ఉంటే పోలీసులకి ఆధారాలు ఇవ్వాలని సూచించిన ఏవీ సుబ్బారెడ్డి.. తనకి దెబ్బలు తగిలి అవమానం జరిగితే ఆమె ప్రెస్‌మీట్ పెట్టి తనని తిట్టడం ఏంటి..? అని ప్రశ్నించారు. ఇప్పుడు ఆమె వెంట కర్నూలు, జమ్మలమడుగు ప్రాంతాలకి చెందిన రౌడీ షీటర్లు తిరుగుతున్నారని.. దాంతో పోలీసుల నుంచి ఆమెకి చిక్కులు ఎదురవుతున్నట్లు ఆరోపించారు. ఈ గొడవ కారణంగా ఒకవేళ టీడీపీ తనని దూరంగా ఉంచినా ఇంట్లో కూర్చొని బాధ పడతానే తప్ప ఏ పార్టీలోనూ చేరనని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. రాబోవు ఎన్నికల్లో పార్టీ ఆదేశిస్తే నంద్యాల లేదా ఆళ్లగడ్డలో పోటీచేసేందుకు తాను రెడీ అని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.

First Published:  1 Jun 2023 10:38 AM IST
Next Story