రామోజీ ముచ్చట ఖాతాదారుడు తీర్చేశాడా?
60 ఏళ్లుగా మార్గదర్శిని నడుపుతున్నా ఇంతవరకు ఒక్క ఫిర్యాదు కూడా లేదని రామోజీరావు చాలాసార్లు చెప్పారు. అయితే మార్గదర్శి తనను మోసం చేసిందని ఆడిటర్ ముష్టి శ్రీనివాస్ విజయవాడలోని లబ్బిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ ఖాతాదారుల విశ్వాసాన్ని సంపాదించుకున్న సంస్థగా ఛైర్మన్ రామోజీరావు పదేపదే చెప్పుకుంటున్నారు. 60 సంవత్సరాలుగా మార్గదర్శిని నడుపుతున్నా ఇంతవరకు ఒక్క ఫిర్యాదు కూడా లేదని గర్వంగా చెప్పుకుంటున్నట్లు చాలాసార్లు చెప్పారు. ప్రభుత్వం దురుద్దేశంతో మార్గదర్శిని వేధిస్తోందని తన మీడియాలో రాసుకుంటున్నారు. అలాంటి రామోజీ ముచ్చట తీరిపోయింది. మార్గదర్శిపై విజయవాడలోని లబ్బిపేట పోలీసులకు ఆడిటర్ ముష్టి శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
ఆ ఫిర్యాదు ఆధారంగా మార్గదర్శిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. శ్రీనివాస్ చెప్పిన ప్రకారం 2021లో మార్గదర్శిలో నెలకు లక్ష రూపాయలు చెల్లించేట్లుగా రూ. 50 లక్షల చిట్‌లో చేరారు. చిట్‌లో చేరేటప్పుడు అవసరమైన అన్నీ ష్యూరిటీలను అందించారు. అప్పుడు అన్నీ డాక్యుమెంట్లు సరిగానే ఉన్నాయని బ్రాంచ్ మేనేజర్ చెప్పారట. అయితే మార్చిలో రూ. 50 లక్షల చిట్‌ను రూ. 37.50 లక్షలకు పాడుకున్నారు. డబ్బులు ఇవ్వమంటే బ్రాంచ్ మేనేజర్ ఇప్పటివరకు ఇవ్వలేదట. కారణం అడిగితే ష్యూరిటీలు సమర్పించలేదు కాబట్టి చిట్ డబ్బులు ఇచ్చేదిలేదన్నారని ఫిర్యాదులో చెప్పారు.
శ్రీనివాస్ ప్రకారం చిట్‌లో 50 మంది ఖాతాదారులుండాల్సి ఉంటే 30 మందితోనే రన్ చేస్తున్నారట. ఒక్కో చిట్ గ్రూపుకు ఒక్కో బ్యాంకు ఖాతా ఓపెన్ చేయాల్సిన యాజమాన్యం అన్నింటికి కలిపి ఒకే ఖాతా ఓపెన్ చేసిందన్నారు. ఖాతాదారుడి ఫిర్యాదు ఆధారంగా బ్రాంచ్ మేనేజర్ బి. శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
నిజానికి మార్గదర్శిపై ఎవరు ఫిర్యాదు చేయలేదని రామోజీ చెప్పుకోవటం అబద్ధమే. ఎందుకంటే అసలు మార్గదర్శిలో మోసాల డొంక కదిలిందే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఫిర్యాదుతోనే. గడచిన 17 ఏళ్ళుగా రామోజీకి వ్యతిరేకంగా ఉండవల్లి పోరాటం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఆ పోరాటానికి ఈ మధ్యనే జగన్ ప్రభుత్వం మద్దతుగా నిలవటంతో ప్రస్తుత డెవలప్మెంట్లు జరుగుతున్నాయి. మొత్తం మీద విశ్వసనీయతకు మార్గదర్శి మారుపేరని రామోజీ చెప్పుకుంటున్నదంతా అబద్ధమే అని తేలబోతోంది. రామోజీ ముచ్చటను ఫిర్యాదుదారుడే తీర్చేసినట్లయ్యింది ఇప్పుడు.