అవంతిని వెంటాడుతున్న ఆడియోలు
ఈ ఆడియో కూడా ఫేక్ అని అవంతి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తన కీర్తి, ప్రతిష్టలను దెబ్బతీసేందుకు కుట్రలో భాగంగానే ఇలాంటివి సృష్టిస్తున్నారని చెప్పారు.
మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరుతో సోషల్ మీడియాలో రెండు రోజులుగా ఒక ఆడియో వైరల్ అవుతోంది. ఇది వరకే ఆయన ఒక మహిళతో మాట్లాడినట్టుగా చెబుతున్న ఒక ఆడియో వైరల్ అయి సంచలనం సృష్టించింది. తాజాగా అదే తరహాలో మరో ఆడియోను టీడీపీ వారు వైరల్ చేశారు. ఐ లవ్ యూ డార్లింగ్ అంటూ ఒక యువతితో ఒక పురుషుడు మాట్లాడిన ఆడియో అది.
ఐ లవ్ యూ బంగారం.. నీతో మాట్లాడి ఎన్ని రోజులైందో!. ముందు నీ ఫోటో పంపు.. 4వ తేదీన ఢిల్లీలో కలుద్దామంటూ ఆడియో టేపులో ఉంది. ఆ ఆడియో మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌దే అంటూ సోషల్ మీడియాతో పాటు కొన్ని చానళ్లలోనూ ప్రసారమైంది. సదరు మహిళ మీకు దగ్గరల్లోనే ఉంటే హైదరాబాద్ ప్రియాంక రెసిడెన్సీలోకి మారుతున్నానంటూ చెప్పగా.. అక్కడికి ఎందుకు నా కుమార్తె చాలా షార్ప్.. పసిగట్టేస్తుంది అంటూ సదరు వ్యక్తి మాట్లాడారు.
ఈ ఆడియో కూడా ఫేక్ అని అవంతి శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తన కీర్తి, ప్రతిష్టలను దెబ్బతీసేందుకు కుట్రలో భాగంగానే ఇలాంటివి సృష్టిస్తున్నారని చెప్పారు. తాను 15 రోజులుగా అయ్యప్ప మాలలో ఉన్నానని.. పది రోజుల క్రితమే ఈ ఆడియో విషయం తన దృష్టికి వచ్చిందని వివరించారు. పోలీసులకు ఇప్పటికే ఫిర్యాదు చేశానని.. దర్యాప్తు కొనసాగుతోందని అవంతి వివరించారు.
అవంతి ఫిర్యాదుపై స్పందించిన సైబర్ క్రైం సీఐ భవానీ ప్రసాద్.. ఇప్పటికే ఈ ఆడియో వేల మందికి చేరిపోయిందని.. అసలు ఎక్కడ నుంచి దీని పోస్టు చేశారన్న మూలం తెలుసుకోవాల్సి ఉంటుందని.. అందుకు చాలా సమయం పడుతుందని చెప్పారు. ఈ ఫిర్యాదుపై సరైన చర్యలు తీసుకుంటామన్నారు.
గతంలో విశాఖకు చెందిన ఒక వివాహితతో అవంతి శ్రీనివాస్ సంభాషణ అంటూ ఒక ఆడియో వచ్చింది. దానిపై కూడా అవంతి ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటికీ దర్యాప్తు ముందుకెళ్లలేదు.