Telugu Global
Andhra Pradesh

కుప్పం ఎపిసోడ్ తో టీడీపీకి లాభమా..? నష్టమా..?

చుట్టూరా పక్క పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు వారి నాయకుడిని విమర్శిస్తే అక్కడ ఉన్నవారు రెచ్చిపోతారు, ఏమైనా చేస్తారు. కానీ కుప్పంలో వైసీపీ కార్యకర్తలు తగ్గేదే లేదన్నారు. చంద్రబాబు ర్యాలీలో ఆయన్ని డౌన్ డౌన్ అన్నారు.

కుప్పం ఎపిసోడ్ తో టీడీపీకి లాభమా..? నష్టమా..?
X

టీడీపీకి కుప్పం కంచుకోట, ఆ పార్టీకి అక్కడ ఎదురే లేదు, తిరుగే లేదు. కుప్పంలో టీడీపీ తరఫున ఎవరు నిలబడినా గెలుస్తారు. నిన్న మొన్నటి వరకూ ఇవే మాటలు వినిపించాయి. కానీ ఇప్పుడు సౌండ్ మారింది. కుప్పంలో చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని ఆల్రడీ ఉదాహరణలతో సహా నిరూపితమవుతోంది. కుప్పం ఎంపీపీని సైతం టీడీపీ చేజార్చుకుంది. మున్సిపాల్టీలో కూడా పెత్తనం పోయింది. దీంతో సహజంగానే వైసీపీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దాని ఫలితమే తాజాగా కుప్పంలో జరుగుతున్న ఆందోళనలు.

ఒక పార్టీవారు మీటింగ్ పెడితే ఇంకో పార్టీ వారు కండువాలు కప్పుకెళ్లి.. తీరా వెళ్లాక డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేసే సంస్కృతి ఏపీలో ఇంకా పూర్తి స్థాయిలో మొదలు కాలేదు. చుట్టూరా పక్క పార్టీ కార్యకర్తలు ఉన్నప్పుడు వారి నాయకుడిని విమర్శిస్తే అక్కడ ఉన్నవారు రెచ్చిపోతారు, ఏమైనా చేస్తారు. కానీ కుప్పంలో వైసీపీ కార్యకర్తలు తగ్గేదే లేదన్నారు. చంద్రబాబు ర్యాలీలో ఆయన్ని డౌన్ డౌన్ అన్నారు. ఆ ర్యాలీ వెళ్లే మార్గంలో వైసీపీ జెండాలు కట్టి తమ బలమేంటో చూపించాలనుకున్నారు. దీంతో బాబు టీమ్ కూడా రెచ్చిపోయింది. కొట్టుకున్నారు, కేసులు పెట్టుకున్నారు, చివరకు చంద్రబాబు రోడ్డెక్కారు.

ఎవరికి లాభం..?

పోనీ స్థానిక సంస్థల్లో ఏదో జరిగిపోయింది, చంద్రబాబు వస్తే అంతా సర్దుకుంటుందని కుప్పం టీడీపీ నేతలు అనుకుంటున్నా.. చంద్రబాబు వచ్చినా వైసీపీ నేతలు వెనక్కి తగ్గడంలేదని ఈ పర్యటనతో రుజువైంది. చంద్రబాబుని సొంత నియోజకవర్గంలో అడ్డుకున్నారంటే, అక్కడ వైసీపీ ఎంతగా బలపడిందో అర్థం చేసుకోవచ్చు. యువకుడైన భరత్ కి అంత ఫాలోయింగ్ ఉందా, లేక మంత్రి పెద్దిరెడ్డి మంత్రాంగం అక్కడ ఫలించిందా, పోనీ సీఎం జగన్ కుప్పంపై పెట్టిన ఫోకస్ ఫలించిందా... వీటిల్లో ఏదో ఒకటి బలంగా నిలబడినట్టే చెప్పుకోవాలి. అందుకే కుప్పంలో తొలిసారి టీడీపీకి వణుకుపుట్టింది. తొలిసారి సొంత నియోజకవర్గంలో చంద్రబాబు నడిరోడ్డుపై కూర్చోవాల్సి వచ్చింది.

దాడులు, ప్రతిదాడులను ఎవరూ సమర్థించరు కానీ.. ఇక్కడ వైసీపీ తన బలం నిరూపించుకోడానికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందనే చెప్పాలి. కుప్పంలో తమకు ఎదురే లేదనుకున్న టీడీపీ.. వైసీపీ జెండాలను చూసి తగ్గాల్సిన పరిస్థితి వచ్చింది. అధినేతకు కూడా అవమానాలు ఎదురైతే.. ఇక తమ పరిస్థితి ఏంటని ఇప్పటికే క్యాడర్ తమదారి చూసుకుంటోంది. పైగా కుప్పంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎక్కువగానే ఉన్నారని గతంలో జరిగిన సంఘటనలు చెబుతున్నాయి. ఆయనేమో అమిత్ షా తో కలసి భోజనం చేశారు. ఈ కన్ఫ్యూజన్లో టీడీపీ శ్రేణులు చెల్లాచెదరయ్యే అవకాశాలున్నాయి. దాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకుంటోంది. కుప్పం నుంచి చంద్రబాబుని సాగనంపే ప్రయత్నాలు ముమ్మరం చేసింది.

First Published:  26 Aug 2022 8:11 AM IST
Next Story