లోకేష్ పై కోడిగుడ్ల దాడి.. యువగళంలో ఉద్రిక్తత
కోడిగుడ్ల దాడి పోలీసుల వైఫల్యంగా అభివర్ణించారు లోకేష్. పోలీసులు న్యాయం వైపు కాకుండా వైసీపీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు.
కడప జల్లా ప్రొద్దుటూరులో నారా లోకేష్ యువగళం పాదయాత్రలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. లోకేష్ నడచి వస్తుండగా కొంతమంది కోడిగుడ్లను దూరం నుంచి విసిరేశారు. టార్గెట్ ఆయనే అయినా, అవి మిస్సై ఆయన భద్రతా సిబ్బందికి తగిలాయి. దీంతో సెక్యూరిటీ అప్రమత్తం అయి ఆయన్ను పక్కకు తీసుకెళ్లారు. యాత్రలో భాగంగా ఓ షాపు వద్ద ఆగి వినియోగదారులతో లోకేష్ మాట్లాడుతుండగా గుడ్లదాడి జరిగిందని అంటున్నారు. సైకోలు రెచ్చిపోయారని, పోలీసులు కూడా వారికే వత్తాసు పలుకుతున్నారంటూ టీడీపీ ఆరోపిస్తోంది. ఈమేరకు ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేసింది.
లోకేష్ గారి పాదయాత్రలో రెచ్చిపోయిన సైకోలు. లోకేష్ భద్రతా సిబ్బంది పై కోడిగుడ్డు విసిరిన వైసిపి కార్యకర్తలు. పోలీసుల ఏకపక్ష వ్యవహార శైలి పై లోకేష్ ఆగ్రహం#YuvaGalamPadayatra#PyschoJagan#LokeshinProddatur #PsychoPovaliCycleRavali pic.twitter.com/g0msK1FHed
— Telugu Desam Party (@JaiTDP) June 1, 2023
ప్రొద్దుటూరు శివాలయం సెంటర్ లో గురువారం మధ్యాహ్నం బహిరంగ సభ జరిగింది. ఆ తర్వాత ఆర్టీసీ బస్టాండ్ మీదుగా లోకేష్ పాదయాత్రగా వస్తున్నారు. అక్కడక్కడ స్థానికులతో మాట్లాడుతూ ముందుకెళ్తున్నారు. ఈ క్రమంలోనే గుడ్లదాడి జరగడం గమనార్హం. దాడి ఘటనతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. గుడ్లు వేసింది ఎవరా అంటూ ఆరా తీశారు. అనుమానాస్పదంగా కనిపించిన ఇద్దర్ని టీడీపీ కార్యకర్తలు చితక్కొట్టారు. వెంటనే పోలీసులు వారిని అడ్డుకుని, ఆ ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులపై లోకేష్ ఆగ్రహం..
కోడిగుడ్ల దాడి పోలీసుల వైఫల్యంగా అభివర్ణించారు లోకేష్. పోలీసులు న్యాయం వైపు కాకుండా వైసీపీకి కొమ్ముకాస్తున్నారని విమర్శించారు. దాడి జరిగినా తాను తగ్గేది లేదని, యాత్ర కొనసాగించి తీరతానని అంటున్నారు లోకేష్.