జగన్ పై దాడి కేసు విచారణలో కీలక పరిణామం
సతీష్ ని కస్టడీకి అప్పగిస్తూ కోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. సతీష్‌ను అడ్వొకేట్ సమక్షంలోనే విచారించాలని షరతు విధించింది.
సీఎం జగన్ పై హత్యాయత్నం కేసులో ఇప్పటికే పోలీసులు సతీష్ ని ప్రధాన నిందితుడిగా తేల్చారు. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా ఉన్న సతీష్ ని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుంటున్నారు. సతీష్ ని వారం రోజులు కస్టడీలోకి కోరుతూ పోలీసులు కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కేవలం మూడు రోజులపాటు అతడిని కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
ఎవరెవరున్నారు..?
సీఎం జగన్ పై విజయవాడలో దాడి జరిగిన అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో కుట్రకోణం ఉందనే అనుమానంతో పలువుర్ని విచారించారు. ప్రధాన నిందితుడిగా సతీష్ ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు కోర్టు రెండు వారాలు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. జైలులో ఉన్న సతీష్ ని ఇప్పుడు పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని తిరిగి విచారణ చేపడతారు. ఈ కేసులో సతీష్ కి ఎవరెవరు సహకరించారు..? వారి వెనక ఎవరున్నారనే వివరాలు రాబట్టే ప్రయత్నం చేస్తారు. సతీష్ ని కస్టడీకి అప్పగిస్తూ కోర్టు కొన్ని కీలక సూచనలు చేసింది. సతీష్‌ను అడ్వొకేట్ సమక్షంలోనే విచారించాలని షరతు విధించింది. నిందితుడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించొద్దని ఆదేశించింది. నిందితుడిని విచారించిన తర్వాత తెలుసుకొన్న అంశాలను కోర్టు ముందు ఉంచాలని సూచించింది.
కీలక పరిణామం..
జగన్ పై దాడి ఘటన జరిగినప్పుడు విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్న కాంతిరాణా ఇప్పుడు బదిలీ అయ్యారు. ప్రతిపక్షాల ఫిర్యాదుతో ఆయన్ను ఎన్నికల కమిషన్ పక్కనపెట్టింది. హత్యాయత్నం కేసు నమోదు చేయడంతోపాటు, విచారణ పేరుతో టీడీపీ నేతల్ని భయభ్రాంతులకు గురి చేశారని ఆ పార్టీ నేతలు, ఎల్లో మీడియా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను పక్కనపెడితే.. క్లిష్టమై ఈ కేసులో ప్రధాన నిందితుడిని తక్కువ టైమ్ లోనే అరెస్ట్ చేశారు పోలీసులు. ఇప్పుడు ఆ నిందితుడి నుంచి మరింత సమాచారం రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విచారణలో ఎవరెవరి పేర్లు బయటకు వస్తాయో చూడాలి.