ఖాకీపై కాలెత్తిన ఖద్దరు.. పోలీసుల తీరుపై విమర్శలు
ఇదేదో చిల్లర బ్యాచ్ చేసిన గొడవ కాదు. ఖద్దరు వేసుకున్న కొంతమంది ఖాకీ డ్రస్సుపై చేసిన దాడి ఇది. ఈ ఘటనపై 24గంటల తర్వాత ఆర్టీసీ ఎండీ స్పందించడం విశేషం, దాడి చేసిన వారిని ఇప్పటికీ పోలీసులు పట్టుకోకపోవడం మరో విశేషం.
ఏపీలో పోలీసుల తీరుపై ఇప్పటికే విమర్శలున్నాయి. అస్మదీయులకు ఒకలా, తస్మదీయులకు మరోలా ట్రీట్మెంట్ ఇస్తారని ఎల్లో మీడియా చాన్నాళ్లుగా టార్గెట్ చేస్తూ కథనాలిస్తోంది. అయితే ఒకదాని తర్వాత ఒకటిగా జరుగుతున్న ఘటనలు ఈ ఆరోపణలు నిజమేననిపించేలా ఉన్నాయి. తాజాగా కావలిలో ఆర్టీసీ బస్సు డ్రైవర్ పై జరిగిన దాడి సంచలనంగా మారింది. 14మంది వాహనాల్లో ఆర్టీసీ బస్సుని వెంబడించి.. కావలి శివార్లలో బస్సుని ఆపి, డ్రైవర్ ని కిందకు దించి చితకబాదారు. బూటు కాలితో తన్నారు. ఇదేదో చిల్లర బ్యాచ్ చేసిన గొడవ కాదు. ఖద్దరు వేసుకున్న కొంతమంది ఖాకీ డ్రస్సుపై చేసిన దాడి ఇది. ఈ ఘటనపై 24గంటల తర్వాత ఆర్టీసీ ఎండీ స్పందించడం విశేషం, దాడి చేసిన వారిని ఇప్పటికీ పోలీసులు పట్టుకోకపోవడం మరో విశేషం.
ఏపీలో ఇలాంటి ఘటనలు చాలా అరుదు. నడిరోడ్డుపై వ్యక్తిగత దాడులు చూస్తూనే ఉన్నాం కానీ, ఇలా ఒకేసారి మూకదాడులు మాత్రం ఇటీవల కాలంలో జరగలేదు. ఆమధ్య స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో వైరి వర్గాల వాహనాలపై కొంతమంది రాడ్లు, కర్రలతో దాడి చేసిన వీడియోలు ఇంకా సోషల్ మీడియాలో ఉన్నాయి. టీడీపీ ఆఫీస్ పై దాడి ఘటనలో నిందితులు సోషల్ మీడియాలో ఓ వర్గానికి హీరోలుగా మారారు. ఇప్పుడు కావలిలో ఆర్టీసీ డ్రైవర్ పై దాడిచేసిన 14మందిలో టీడీపీ, జనసేన నేతలు ఉండి ఉంటే కచ్చితంగా ఆ విషయం ఈపాటికే హైలైట్ అయ్యేది. కానీ ఆ ఖద్దరు వెనకున్న పార్టీ ఏంటో ఇంకా బయటకు రాలేదు. ఒకవేళ నిజంగానే అధికార పార్టీ నేతలు ఉండి ఉంటే.. పోలీసులు వారిని పట్టుకునే సాహసం చేస్తారా అనేది సమయం గడిస్తే కానీ తెలియదు. కనీసం యూనియన్లు కూడా సందర్భానుసారం స్పందించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించక మానదు.
మొత్తమ్మీద ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ తర్వాత ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. డ్రైవర్ పై దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎన్నికల ఏడాదిలో ఇలాంటి దాడులు, విపరీతాలు.. సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతాయి. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే. ఈ దాడి వీడియోలను వైరల్ చేస్తూ.. పోలీసుల పనితీరుని ప్రశ్నిస్తున్నాయి వైరి వర్గాలు, ఎల్లోమీడియా సహజంగానే మరింత మంట పెడుతోంది.