తెలుగుదేశంలో అచ్చెన్న వర్గం అసమ్మతితో గందరగోళం
టీడీపీ అధికారికంగా నియమించిన నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమానంగా అచ్చెన్నాయుడు వర్గం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలోనూ అచ్చెన్న అండదండలున్నాయంటూ ఓ నేత సొంత కుంపటి పెట్టడం కేడర్‌లో ఆందోళన నెలకొంది.
తెలుగుదేశం పార్టీలో కీలక బాధ్యతల్లో ఉన్న అధ్యక్షుడే వర్గాలకు ఊతమిస్తూ, నియోజకవర్గాల్లో అసమ్మతికి కారణం అవుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి అనుకూల వాతావరణం ఏర్పడుతున్న దశలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు వ్యవహారశైలి చర్చనీయాంశం అవుతోంది. గతంలోనూ తిరుపతి ఉప ఎన్నిక సందర్భంగా పార్టీ లేదు.. బొక్కా లేదు అని అచ్చెన్న చేసిన దురుసు వ్యాఖ్యలు బయటకొచ్చి పార్టీలో అలజడి రేపాయి.
కేవలం అచ్చెన్నాయుడు వల్లే ప్రత్యేకంగా పార్టీలో ఓ అసమ్మతి వర్గం ఒక్కో నియోజకవర్గంలో తయారై తలనొప్పి సృష్టిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఉత్తరాంధ్రలో చాలా నియోజకవర్గాలలో అచ్చెన్నాయుడు మనుషులమని, తమకే టికెట్ అంటూ సొంతంగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం అధిష్టానానికి చికాకు పెడుతోంది. టీడీపీ అధికారికంగా నియమించిన నియోజకవర్గ ఇన్‌చార్జిలతో సమానంగా అచ్చెన్నాయుడు వర్గం ప్రత్యేకంగా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో ప్రతీ నియోజకవర్గంలోనూ అచ్చెన్న అండదండలున్నాయంటూ ఓ నేత సొంత కుంపటి పెట్టడం కేడర్‌లో ఆందోళన నెలకొంది.
కింజరాపు కుటుంబం చొరవతో టీడీపీలో చేరిన కలమట వెంకటరమణకి పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మామిడి గోవిందరావు తాను అచ్చెన్న మనిషినంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కింజరాపు కుటుంబంతో మొదటి నుంచీ పార్టీలో ఆధిపత్య పోరున్న కిమిడి కళావెంకటరావు ఎచ్చెర్ల నియోజకవర్గంలోనూ అచ్చెన్న మనిషిని అంటూ కలిశెట్టి అప్పలనాయుడు రోజూ ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. శ్రీకాకుళంలో గుండ అప్పలసూర్యనారాయణ దంపతులకు వ్యతిరేకంగా గొండు శంకర్ సెపరేటుగా టీడీపీ ప్రోగ్రామ్స్ చేపడుతున్నారు. శంకర్ వెనుక ఉన్నది కూడా అచ్చెన్నాయుడేనని గుండ దంపతులు గుర్రుగా ఉన్నారు.
రాయలసీమలో వైసీపీలో ఉన్న శిల్పా సోదరులకు అచ్చెన్నాయుడితో వ్యాపార సంబంధాలున్నాయని బయట టాక్. ఈ నేపథ్యంలో వారు కూడా అచ్చెన్నాయుడి సిఫారసుతో టీడీపీలోకి రావొచ్చనే వార్తలతో..అక్కడి టీడీపీ ఇన్‌చార్జిలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అధ్యక్ష స్థానంలో ఉండి అసమ్మతిని చక్కదిద్దాల్సిన అచ్చెన్నాయుడే చాలా నియోజకవర్గాలలో అసమ్మతిని పెంచి పోషిస్తున్నారనే ప్రచారంతో టీడీపీలో గందరగోళం నెలకొంది.