Telugu Global
Andhra Pradesh

అసైన్డ్ భూముల తేనెతుట్టెను జగన్ కదిలించినట్టేనా..?

అసైన్డ్ భూములను తక్కువ రేటుకి అమ్మిన లబ్ధిదారులు ఇప్పుడు వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పుకుంటారా అనేది అనుమానమే. అంటే ఇప్పటి వరకు అనధికారికంగా జరిగిన అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల వ్యవహారం గందరగోళంగా మారే అవకాశముంది.

అసైన్డ్ భూముల తేనెతుట్టెను జగన్ కదిలించినట్టేనా..?
X

అసైన్డ్ భూముల విషయంలో ఇప్పటికే చాలా వివాదాలున్నాయి. ఈ వివాదాలను పరిష్కరించే దిశగా ఏపీ ప్రభుత్వం ముందడుగు వేసింది. అసైన్డ్ భూములు, లంక భూముల విషయంలో లబ్ధిదారులకే పూర్తి హక్కు కేటాయిస్తూ జగన్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ నిర్ణయంతో కొత్త సమస్యలు పుట్టుకొచ్చే ప్రమాదం ఉంది. అసైన్డ్ భూములపై ఇప్పటి వరకూ జరిగిన క్రయ విక్రయాలన్నీ గందరగోళంలో పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

అసైన్డ్ భూములంటే..?

భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం కేటాయించేదే అసైన్డ్ భూమి. దీనిపై లబ్ధిదారులకు అనుభవించే హక్కే కానీ విక్రయించే హక్కు లేదు. లబ్ధిదారుల తర్వాత వారి వారసులకు మాత్రమే ఆ భూమిపై హక్కు లభిస్తుంది. అది కూడా అమ్ముకోడానికి లేదు. అయితే అనధికారికంగా క్రయ విక్రయాలు జరుగుతుంటాయి, కానీ వాటికి ఎలాంటి రిజిస్ట్రేషన్లు కావు. ఇప్పుడు రిజిస్ట్రేషన్లు జరుగుతాయని జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లబ్ధిదారులు భూమి పొందిన 20 ఏళ్ల తర్వాత ఆ హక్కు లభిస్తుందని అన్నారు. అది కూడా అసలైన లబ్ధిదారులు, వారు చనిపోతే వారసులకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకునే హక్కు ఉంటుందన్నారు. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిందంటే ఆ తర్వాత వారు వాటిని విక్రయించుకోవచ్చు.

అక్కడే మెలిక..

ఇప్పటి వరకూ అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి వాటి విలువ తక్కువగా ఉంటుంది. అంటే అవసరానికి తగ్గట్టు వచ్చిన రేటుకి తెగనమ్ముకుంటారు లబ్ధిదారులు. ఇప్పుడు వాటికి రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయంటే వాటిని కొన్నవారు ఊరికే ఉంటారా..? లబ్ధిదారుల పేరుతో వాటిని రిజిస్టర్ చేయించి, ఆ తర్వాత తమకి విక్రయించినట్టుగా పత్రాలు కావాలంటారు. అయితే అసైన్డ్ భూములను తక్కువ రేటుకి అమ్మిన లబ్ధిదారులు ఇప్పుడు వాటిని రిజిస్ట్రేషన్ చేయడానికి ఒప్పుకుంటారా అనేది అనుమానమే. అంటే ఇప్పటి వరకు జరిగిన అసైన్డ్ భూముల అమ్మకాలు, కొనుగోళ్ల వ్యవహారం గందరగోళంగా మారే అవకాశముంది.

కొత్త సమస్యలు..

ఇప్పటికే క్రయవిక్రయాలు జరిగిన అసైన్డ్ భూముల విషయంలో కొత్త సమస్యలు మొదలయ్యే ప్రమాదం ఉంది. ఏపీలో మొత్తం 63,191,84 ఎకరాల అసైన్‌ మెంట్‌ ల్యాండ్స్‌ ఉన్నట్టు రికార్డులున్నాయి. వాటిలో ఎన్ని ఎకరాలు లబ్ధిదారుల చేతులో ఉన్నాయో వివరాలు లేవు. అసైన్ మెంట్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్లు మొదలయితే అసలు సమస్యలు వెలుగులోకి వస్తాయి.

First Published:  12 July 2023 7:03 PM IST
Next Story