Telugu Global
Andhra Pradesh

టీటీడీ ఛైర్మన్ రేసులో ఆ ఇద్దరు.!

క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక గజపతి రాజు.. సింహచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారా అనేది డౌటే.

టీటీడీ ఛైర్మన్ రేసులో ఆ ఇద్దరు.!
X

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొత్త ఛైర్మన్ ఎవరన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవలి ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత టీటీడీ ఛైర్మన్ పదవికి భూమన కరుణాకర్ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఆ పదవి ఖాళీగా ఉంది. కాగా, రెండు మూడు రోజులుగా ఈ పదవి కోసం ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు మాజీ కేంద్రమంత్రి అశోక గజపతి రాజు కాగా, మరొకరు టీవీ-5 అధినేత BR నాయుడు. ఈ ఇద్దరిలో చంద్రబాబు ఎవరికి టీటీడీ ఛైర్మన్ పదవి కట్టబెడతారనేది ఆసక్తిగా మారింది.

ఉత్తరాంధ్రకు చెందిన అశోక గజపతి రాజు.. తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నేత. కేంద్రమంత్రిగానూ పనిచేశారు. అయితే ఇటీవలి ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు. కానీ, ఆయన కూతురు అదితి గజపతి రాజు విజయనగరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన అశోక గజపతి రాజు.. సింహచలం దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆయనకు టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తారా అనేది డౌటే. కానీ, టీటీడీ ఛైర్మన్ పదవికి అశోక గజపతి రాజు మంచి ఎంపికేనన్న అభిప్రాయమూ వినిపిస్తోంది.

మరోవైపు టీవీ-5 అధినేత బొల్లినేని రాజగోపాల్‌ నాయుడు (BR నాయుడు), చంద్రబాబు నాయుడు ఒకే జిల్లాకు, ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. టీవీ-5కి టీడీపీ ఆస్థాన ఛానెల్‌ అన్న పేరు కూడా ఉంది. దీంతో టీటీడీ ఛైర్మన్ పదవి బీ.ఆర్.నాయుడుకు ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. కాగా, బీ.ఆర్.నాయుడును దగ్గరగా చూసిన వ్యక్తులు మాత్రం పవిత్రమైన టీటీడీ ఛైర్మన్ పదవికి ఆయన సరైన ఎంపిక కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సొంత సామాజికవర్గానికి టీటీడీ ఛైర్మన్ పదవి ఇస్తే విమర్శలకు కూడా అవకాశం ఇచ్చినట్లవుతుంది. దీంతో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది.

First Published:  30 Jun 2024 11:32 AM GMT
Next Story