Telugu Global
Andhra Pradesh

ఎంఐఎం అంటే ఇంత భయమా?

చంద్రబాబు అవినీతిపరుడే అని అసద్ ఇంత స్పష్టంగా చెప్పినా తమ్ముళ్ళు ఒక్క‌రు కూడా నోరు విప్పలేదు. దీంతోనే ఎంఐఎం అంటే టీడీపీ నేతలకు ఎంత భయముందో అర్థ‌మైపోతోంది.

ఎంఐఎం అంటే ఇంత భయమా?
X

తమ్ముళ్ళు ఎంఐఎం అంటే ఎంతగా భయపడుతున్నారో అర్థ‌మైపోతోంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్నారు. ఈ విషయమై ఎంఐఎం చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. తెలుగు రాష్ట్రాల్లోని పార్టీ నేతలతో సమీక్షలో మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్టుపై సెటైర్లు వేశారు. ఆంధ్రలో చంద్రుడు ప్రశాంతంగా జైలులో ఉన్నట్లు ఎద్దేవాచేశారు. చంద్రబాబు జైలుకు ఎందుకు వెళ్ళారో ప్రతి ఒక్క‌రికి తెలుసన్నారు.

ఓవైసీ ఉద్దేశంలో స్కామ్‌లో ఇరుక్కున్నారు కాబట్టే, ఆధారాలున్నాయి కాబట్టే సీఐడీ అరెస్టు చేసిందని.. అలాగే విచారణలో చంద్రబాబు అవినీతికి ఆధారాలున్నాయని నమ్మిన తర్వాతే ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండు విధించిందని ఓవైసీ మాటలకు అర్థం. ఏపీలో ప్రస్తుతం రెండే ఆప్షన్లున్నాయన్నారు. ఒకటేమో వైసీపీ రెండోదేమో తెలుగుదేశం పార్టీగా చెప్పారు. జగన్ పరిపాలన బాగానే ఉందని అభిప్రాయపడ్డారు. ఏపీలో కూడా ఎంఐఎం పనిచేయాల్సి ఉంద‌న్నారు.

ఇక్కడ విషయం ఏమిటంటే చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు కాబట్టే అరెస్టయి, జైలులో ఉన్నారని అసద్ స్పష్టంగానే చెప్పారు. అలాగే జగన్ పరిపాలన బాగానే ఉందన్నారు. చంద్రబాబును నమ్మొద్దని, ఓటు వేయద్దని కూడా పిలుపిచ్చారు. చంద్రబాబు అవినీతి, అరెస్టు, రిమాండు గురించి అసద్ ఇంత స్పష్టంగా కామెంట్ చేసినా కౌంటరుగా తమ్ముళ్ళల్లో ఒక‌రి నోరు కూడా లేవలేదు. మామూలుగా ఎవరు చంద్రబాబుకు వ్యతిరేకంగా మాట్లాడినా తమ్ముళ్ళు వరసబెట్టి మాటలతో యుద్ధం మొదలుపెట్టేస్తారు. ట్విట్టర్ వేదికగా విపరీతంగా ట్రోల్‌ చేసేస్తారు. పాత పురాణాలన్నింటినీ తవ్వితీసి కొత్తగా చాకిరేవు పెడతారు.

అలాంటిది చంద్రబాబు అవినీతిపరుడే అని అసద్ ఇంత స్పష్టంగా చెప్పినా తమ్ముళ్ళు ఒక్క‌రు కూడా నోరు విప్పలేదు. దీంతోనే ఎంఐఎం అంటే టీడీపీ నేతలకు ఎంత భయముందో అర్థ‌మైపోతోంది. చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళల్లో చాలామందికి వ్యాపారాలు, ఫాం హౌసులు, సొంతిళ్ళు ఉన్నవి హైదరాబాద్‌లోనే. అసద్‌ను ఏమన్నా అంటే హైదరాబాద్‌లో తమకు ఎక్కడ సమస్యలు వస్తాయో అని తమ్ముళ్ళందరు భయపడినట్లున్నారు. చంద్రబాబు అవినీతిపరుడే, అరెస్టు సబబే అని ఇప్పటివరకు అసద్ తప్ప ఇంకెవరూ మాట్లాడలేదు. అయినా అసద్‌కు వ్యతిరేకంగా నోరు విప్పడానికి వెనకాడుతున్నారు.


First Published:  28 Sept 2023 9:58 AM IST
Next Story