అవనిగడ్డ, పెడన మాకేనంటున్న జనసేన.. టీడీపీ మాటేంటి?
ఉమ్మడి గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు కాస్తో కూస్తో అవకాశాలున్నది ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే. ఇందులో విజయవాడ వెస్ట్, ఈస్ట్, మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన స్థానాలను జనసేన ఆశిస్తోంది.
అవనిగడ్డ, పెడన.. కృష్ణా జిల్లాలోని ఈ రెండు నియోజకవర్గాలనూ పొత్తులో తమకే కేటాయించాలని జనసేన కోరుతోంది. ఈ నియోజకవర్గాల్లో తమకు విజయావకాశాలు ఉన్నాయని ఆ పార్టీ చెబుతోంది. అయితే ఈ రెండు నియోజవకర్గాల్లో టీడీపీకి మండలి బుద్ధప్రసాద్, బూరగడ్డ వేదవ్యాస్ లాంటి అత్యంత సీనియర్ నేతలు ఉన్నారు.. వారిని కాదని జనసేనకు ఈ సీట్లివ్వడానికి టీడీపీ ఎంత వరకు అంగీకరిస్తుందనేదే ఇక్కడ ప్రశ్న.
బలం ఉంది.. టికెట్లు కావాలి
ఉమ్మడి గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు కాస్తో కూస్తో అవకాశాలున్నది ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే. ఇందులో విజయవాడ వెస్ట్, ఈస్ట్, మచిలీపట్నం, అవనిగడ్డ, పెడన స్థానాలను జనసేన ఆశిస్తోంది. మిగిలినవి ఎలా ఉన్నా.. విజయవాడ వెస్ట్‌తోపాటు అవనిగడ్డ, పెడన కోసం పట్టుబట్టనుంది. అవనిగడ్డలో జనసేన పార్టీకి ఇన్‌ఛార్జ్ లేరు కానీ, బలమైన కేడర్ ఉంది. కాపుల ఓట్లు ఎక్కువగా ఉండటం తమకు కలిసొస్తుందని జనసేన అంచనా. ఉమ్మడి కృష్ణా జిల్లా జనసేన అధ్యక్షుడు బండ్రెడ్డి రాము అవనిగడ్డ టిక్కెట్ ఆశిస్తున్నారు. అయితే ఇక్కడ టీడీపీ నుంచి సీనియర్ నేత మండలి బుద్ధ ప్రసాద్ రేసులో ఉన్నారు. అవనిగడ్డ తనకే ఖాయమైపోయిందని ఆయన ప్రచారం చేసుకుంటున్నారు.
పెడనలోనూ పోటాపోటీ
పెడన నియోజకవవర్గంలోనూ టీడీపీ, జనసేన రెండూ బలంగానే ఉన్నాయి. ఇక్కడ జనసేన ఇన్‌ఛార్జ్‌గా ఉన్న యడ్లపల్లి రామ్ సుధీర్ వైసీపీలో చేరడంతో పంచకర్ల రమేష్‌ను ఆ స్థానంలో నియమించారు. తాము పెడనలో కచ్చితంగా గెలుస్తామని జనసేన చెబుతోంది. అయితే ఇక్కడ టీడీపీ ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కాగిత కృష్ణ ప్రసాద్‌తోపాటు సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ కూడా టికెట్ నాదంటే నాదని పోరాడుతున్నారు. మరోవైపు వేదవ్యాస్ ఇటీవల పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యారు. పొత్తులో పెడన టికెట్ జనసేనకు దక్కితే తాను జనసేనలో చేరి పెడన స్థానం నుంచి పోటీ చేస్తానని వేదవ్యాస్ చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.